భారత పాస్‌పోర్ట్ వల్ల ఎదురయ్యే సమస్యలపై ఓ భారతీయ టెకీ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. లండన్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ డెవలపర్ కునాల్ కుష్వాహా, భారత పాస్‌పోర్ట్ వల్ల తన జీవితం మరింత క్లిష్టంగా మారిందని సోషల్ మీడియా వేదిక Xలో పేర్కొన్నారు. ప్రతి విదేశీ ప్రయాణానికి భారీ పేపర్‌వర్క్ చేయాల్సి రావడం వల్ల, “ఇండియన్ పాస్‌పోర్ట్ ఇక నా జీవితానికి విలువ చేర్చడం లేదు” అని వ్యాఖ్యానించారు.
తన బెస్ట్ ఫ్రెండ్ పుట్టినరోజుకు ఐర్లాండ్ వెళ్లలేకపోయిన సంఘటనను ఆయన ఉదాహరణగా చెప్పారు. సాధారణంగా టికెట్ బుక్ చేసి సర్ప్రైజ్ ఇవ్వాల్సిన చోట, వీసా వెబ్‌సైట్లు తెరవాల్సి వచ్చిందని చెప్పారు. ఇటీవల జర్మనీలో ఉన్న కారణంగా షెంగెన్ నిబంధనల ప్రకారం మిగిలిన రోజులు సరిపోక, డబ్లిన్ వెళ్లే అవకాశం కోల్పోయానని వివరించారు.
డబ్బు లేదా సమయం సమస్య కాకుండా, వీసా పరిమితులే తన ప్రయాణాన్ని అడ్డుకున్నాయని కునాల్ తెలిపారు. బెర్లిన్‌లో కొన్ని రోజులు గడిపిన ఒక్క కారణంతోనే మరో దేశానికి వెళ్లలేకపోయానని, ఇది చాలా బాధాకరమని చెప్పారు. గ్లోబల్‌గా పని చేసే వారికి ఈ రకమైన పరిమితులు మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని అన్నారు.
షెంగెన్ వీసా ప్రక్రియను ఆయన “ఫుల్‌టైమ్ ఉద్యోగం”తో పోల్చారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, కవర్ లెటర్లు, బుకింగ్స్, వివరణలు… ఇలా ప్రతి ప్రయాణానికి ఒకే పత్రాలు పదే పదే ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లలో ఇతర దేశాల పాస్‌పోర్ట్ ఉన్నవారు సులభంగా వెళ్లిపోతుంటే, తాను ఫైల్స్ పట్టుకుని నిలబడాల్సి వస్తోందని చెప్పారు.
ఇది దేశభక్తిపై విమర్శ కాదని, రోజువారీ జీవితంలో ఎదురయ్యే ‘ఫ్రిక్షన్’ గురించేనని కునాల్ స్పష్టం చేశారు. రూపాయి విలువ తగ్గడం, వాయు కాలుష్యం, పాతకాలపు బ్యాంకింగ్–KYC వ్యవస్థలూ సమస్యలేనని పేర్కొన్నారు. “జాతీయ గర్వం ముఖ్యం కానీ, ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కూడా అవసరం” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ ముగించారు.