ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణాలు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నప్పటికీ, స్థానికంగా చిన్న దూరాలకు ఆటోలు, ట్యాక్సీల్లో వెళ్లాలంటే ప్రయాణికులు అధిక ఛార్జీల భారం మోయాల్సి వస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాలు, పెద్ద పట్టణాల్లో దగ్గర దూరాలకు కూడా ఆటో, క్యాబ్ డ్రైవర్లు భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆటో–ట్యాక్సీ రంగంలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో చౌకైన, నమ్మకమైన సేవలు ఉంటే బాగుంటుందనే ఆకాంక్ష చాలాకాలంగా ఉంది. ఇప్పుడు ఆ ఆశలు నిజమయ్యే దశకు చేరుకున్నాయి.
ప్రైవేటు క్యాబ్ బుకింగ్ సంస్థలకు పోటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆంధ్రా ట్యాక్సీ’ అనే ప్రభుత్వ యాప్, పోర్టల్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తక్కువ ధరలకే, సురక్షితంగా ఆటో, క్యాబ్ సేవలు పొందవచ్చు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో ఈ యాప్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా విజయవాడకు వచ్చే పర్యాటకులు, భక్తులు ఆటో, క్యాబ్ డ్రైవర్ల చేతుల్లో మోసపోకుండా కాపాడటమే ఈ యాప్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. దుర్గమ్మ ఆలయం, భవానీ ద్వీపం వంటి పర్యాటక ప్రాంతాలకు చౌకగా, నమ్మకమైన రవాణా సేవలు అందించనుంది.
ఇప్పటికే విజయవాడకు వచ్చే సందర్శకుల నుంచి స్థానిక ఆటో, క్యాబ్ డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్ ద్వారా ఛార్జీల్లో పారదర్శకత తీసుకురావడంతో పాటు, అక్రమ వసూళ్లకు చెక్ పెట్టాలని భావిస్తోంది. అంతేకాదు, ఈ యాప్ వల్ల స్థానిక డ్రైవర్లకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటు, ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్ ద్వారా ఆటోలు, క్యాబ్‌లను యాప్‌తో పాటు వాట్సాప్, ఫోన్ కాల్, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా సులభంగా బుక్ చేసుకోవచ్చు. యాప్‌లో గమ్యస్థానాన్ని నమోదు చేస్తే, రిజిస్టర్ అయిన డ్రైవర్ల వివరాలు కనిపిస్తాయి. యాప్‌లో చేరే డ్రైవర్లు, వాహనాలను అధికారులు ముందుగానే పూర్తిగా పరిశీలించి అనుమతిస్తారు. ఫిట్‌నెస్ ఉన్న వాహనాలకే అవకాశం కల్పించనున్నారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణ వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరేలా ఈ యాప్‌ను రూపొందించారు. ప్రయాణికుల డేటా రాష్ట్ర డేటా కేంద్రంలో భద్రంగా నిల్వ ఉంటుంది. భవిష్యత్తులో హోటల్ బుకింగ్‌లు, టూరిజం ప్యాకేజీలు, రైతులకు డ్రోన్ సేవలు కూడా ఈ యాప్ ద్వారా అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.