ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల కోసం వరుసగా పర్యాటక ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ తరహాలోనే, ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు ఎప్పుడూ నడవని కొత్త రూట్లను ప్రారంభించి, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక–మైసూరు, కాశీ–అయోధ్య పేర్లతో రెండు కొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటించింది.
కర్ణాటక–మైసూరు యాత్ర జనవరి 20 నుంచి ప్రారంభమవుతుంది. రాజమండ్రి నుంచి బయలుదేరే సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులో మొత్తం 9 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. ఈ టూర్‌లో మొత్తం 14 పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంది. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనంతో యాత్ర ప్రారంభమై, మహానంది, మంత్రాలయం, హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు, ఉడిపి, శృంగేరి, హొరనాడు, ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య, శ్రీరంగపట్నం, మైసూరు వంటి ప్రముఖ క్షేత్రాలు ఇందులో ఉన్నాయి.
ఈ కర్ణాటక–మైసూరు టూర్‌కు ఒక్కొక్కరు రూ.11,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో ప్రయాణంతో పాటు రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం కూడా కల్పిస్తారు. భోజన ఏర్పాట్లన్నింటినీ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్వయంగా నిర్వహిస్తారు. అయితే ఎక్కడైనా విశ్రాంతి గదులు తీసుకుంటే, దానికి సంబంధించిన ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
కాశీ–అయోధ్య యాత్ర ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్ర మొత్తం 11 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీలో 13 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. తొలుత భువనేశ్వర్‌కు చేరుకుని, అక్కడి నుంచి పూరి జగన్నాథుడి దర్శనం, కోణార్క్ సూర్యదేవాలయం, జాజ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం, కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, గయ, బుద్ధగయ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
మహాశివరాత్రి రోజున కాశీవిశ్వేశ్వరుని దర్శనం ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. తిరుగు ప్రయాణంలో అరసవిల్లి, శ్రీకుర్మం, అన్నవరం క్షేత్రాలను కూడా దర్శించేలా ఈ టూర్‌ను రూపొందించారు. ఈ యాత్రకు ఒక్కొక్కరు రూ.13,000 చెల్లించాలి. ఈ మొత్తంలో భోజన సదుపాయం కూడా ఉంటుంది. భక్తులకు సౌకర్యవంతమైన, భద్రమైన పుణ్యక్షేత్ర యాత్ర అందించడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఈ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకువచ్చిందని అధికారులు తెలిపారు.