ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 7వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
7. ఓం సకల శాస్త్ర స్వరూపిణ్యై నమః*
అర్థం: శాసించి నియమం చేసే గ్రంథాన్ని శాస్త్రం అంటారు. ఇక్కడ ఎన్నో శాస్త్రాలు ఎన్నో విషయాలను మనకు బోధిస్తూ ఉండవచ్చు. మరి భగవద్గీత చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలను సంపాదించుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము మొదలైన అధ్యాయాలలో అనేక శాస్త్ర విషయాలు తెలుపబడ్డాయి.
‘సర్వ శాస్త్రమయీ గీతా’ (సకల శాస్త్ర విశేషాలతో కూడినది భగవద్గీత) అని మహాభారతం చెపుతుంది. ఇది సకలశాస్త్ర సారమైన జ్ఞానం.
గీతా సుగీతా కర్తవ్యా
కిమన్యైః శాస్త్ర సంగ్రహైః ।
యా స్వయం పద్మనాభస్య
ముఖపద్మాత్ వినిఃసృతా ॥
-మహా భారతము, భీష్మ పర్వము, అ-43, శ్లో-1
అర్థం: సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ముఖపద్మం నుండి వెలువడిన శ్రీమద్భగవద్గీతను కీర్తించాలి. అప్పుడు ఇక తక్కిన శాస్త్రములతో పనే లేదు.
ఈ విధంగా సకల శాస్త్రాల సారాంశ రూపమైన శ్రీమద్భగవద్గీతకు ఆచరణభావంతో నమస్కరిస్తున్నాను.
జై గురుదేవ్
ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్