హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Hyderabad Real Estate) రంగానికి 2025 సంవత్సరం నిజంగా లక్కీ ఇయర్‌గా చెప్పుకోవాలి. గత కొన్నేళ్లుగా స్థిరంగా కొనసాగుతున్న మార్కెట్, ఈ ఏడాది ప్రీమియం (Premium Homes) ఇళ్ల విక్రయాలతో మరింత బలపడింది. ముఖ్యంగా రూ. కోటి పైబడిన ధరలతో ఉన్న ఇళ్లకు డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగింది. నగరంలో సంపన్న వర్గాలు మాత్రమే కాకుండా, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ప్రీమియం హోమ్స్ వైపు మొగ్గు చూపుతున్నారని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
నైట్ ఫ్రాంక్ (Knight Frank Report) ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2025 (Property Registrations 2025) డిసెంబర్ నెలలో హైదరాబాద్‌లో జరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు గత ఏడాదితో పోలిస్తే 14 శాతం పెరిగాయి. కేవలం సంఖ్యలోనే కాకుండా, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన మొత్తం విలువ కూడా 23 శాతం పెరగడం గమనార్హం. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయని సూచిస్తోంది. ముఖ్యంగా హైఎండ్ హౌసింగ్ సెగ్మెంట్ నగరంలో కొత్త ట్రెండ్‌గా మారింది.
మొత్తం 2025 సంవత్సరాన్ని పరిశీలిస్తే, హైదరాబాద్‌లో (Hyderabad Housing Market) 75 వేలకుపైగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ, మొత్తం లావాదేవీల విలువ మాత్రం భారీగా పెరిగింది. 2025లో రిజిస్టర్ అయిన ఇళ్ల మొత్తం విలువ రూ. 52 వేల కోట్లకు పైగా ఉండటం విశేషం. ఇది గత ఏడాదితో పోలిస్తే 11 శాతం అధికం. అంటే తక్కువ సంఖ్యలో ఇళ్లు అమ్ముడైనా, ఖరీదైన ప్రాపర్టీల వాటా ఎక్కువగా ఉందన్న మాట.
రూ. కోటి అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది 35 శాతం వరకు పెరిగాయి. సంఖ్య పరంగా చూస్తే ఈ ఇళ్ల వాటా సుమారు 20 శాతంగా ఉన్నప్పటికీ, మొత్తం ఇళ్ల కొనుగోళ్ల విలువలో వీటి వాటా దాదాపు 48 శాతంగా నమోదైంది. ఇది నగరంలో లగ్జరీ లివింగ్‌కు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా చూపిస్తోంది.
కోకాపేట్, కొండాపూర్, పుప్పాలగూడ, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, గగన్‌పహాడ్ వంటి ప్రాంతాలు ప్రీమియం (Luxury Homes Hyderabad) హౌసింగ్‌కు హాట్‌స్పాట్‌లుగా మారాయి. ఐటీ హబ్‌లకు సమీపం, మంచి రోడ్డు కనెక్టివిటీ, ఆధునిక సదుపాయాలు ఉండటం వల్ల ఈ ప్రాంతాల్లో ఖరీదైన ఇళ్లకు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరోవైపు, నగరంలో రిజిస్టర్ అయిన చాలా ఇళ్లు 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో ఇలాంటి ఇళ్ల వాటా సుమారు 68 నుంచి 69 శాతం వరకు ఉంది.
హైదరాబాద్ రెసిడెన్షియల్ Residential Property Telagana) మార్కెట్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. వీటిలో రంగారెడ్డి జిల్లా 44 నుంచి 46 శాతం రిజిస్ట్రేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 40 శాతం పైగా వాటాతో రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ జిల్లా వాటా మాత్రం 14 నుంచి 15 శాతం మధ్యనే ఉంది. అంతేకాకుండా, నగరంలో ఇళ్ల సగటు ధరలు కూడా 2025లో సుమారు 5 శాతం పెరిగాయి. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ధరల పెరుగుదల మరింత ఎక్కువగా నమోదైంది.