అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్–కెనడా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదం ఇప్పుడు మరింత తీవ్రమైన దశకు చేరింది. కెనడా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే విమానాలపై 50 శాతం భారీ సుంకం విధిస్తానని ట్రంప్ తాజాగా హెచ్చరించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ట్రంప్‌కు ఉన్న రాజకీయ, వాణిజ్య విభేదాల నేపథ్యంలో ఈ ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, విమానయాన రంగాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.
ఈ వివాదానికి కేంద్రంగా అమెరికాలోని జార్జియా రాష్ట్రం, సవానా కేంద్రంగా పనిచేస్తున్న గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ సంస్థ ఉంది. ఈ సంస్థ తయారు చేసిన ప్రైవేట్ జెట్లకు కెనడా ప్రభుత్వం ధ్రువీకరణ (సర్టిఫికేషన్) ఇవ్వడాన్ని నిరాకరించిందని ట్రంప్ ఆరోపించారు. ఇది అమెరికా కంపెనీలపై కెనడా అన్యాయంగా వ్యవహరిస్తోందనే సంకేతంగా ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయని ఆయన ఆరోపిస్తూ, దీనికి ప్రతిగా గట్టి చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కెనడా చర్యలకు ప్రతీకారంగా, కెనడాకు చెందిన అతిపెద్ద విమాన తయారీ సంస్థ బొంబార్డియర్‌తో పాటు ఇతర అన్ని కెనడియన్ విమానాల అమెరికా ధ్రువీకరణను రద్దు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు, పరిస్థితిని వెంటనే సరిదిద్దకపోతే అమెరికాలో విక్రయించే ప్రతి కెనడియన్ విమానంపై 50 శాతం సుంకం విధిస్తానని తన సోషల్ మీడియా పోస్టులో హెచ్చరించారు. ఇది అమలులోకి వస్తే, కెనడియన్ విమాన పరిశ్రమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో, అమెరికా–కెనడా వాణిజ్య సంబంధాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, కెనడా చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటే ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ గత వారాంతంలోనే హెచ్చరించారు. అయితే కెనడా ఇప్పటికే చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఆ సుంకాల అమలు విషయంలో ట్రంప్ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. తాజా విమానయాన హెచ్చరికలపై బొంబార్డియర్ సంస్థ గానీ, కెనడా రవాణా మంత్రిత్వ శాఖ గానీ అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. ఈ పరిణామాలు అమెరికా–కెనడా మధ్య వాణిజ్య యుద్ధం ఇంకా ముదిరే సూచనలుగా మారుతున్నాయి.