ఆవు నెయ్యి అనగానే చాలామందికి వంటల్లో ఉపయోగించడం లేదా పిల్లలకు మెదడుకు మంచిదని మాత్రమే అనుకుంటాం. కానీ ఇది కేవలం ఆహారానికే పరిమితం కాదు. చర్మ సంరక్షణలోనూ ఆవు నెయ్యి ఎంతో ఉపయోగకరమని ఆయుర్వేదం తెలుపుతుంది. రసాయనాలతో నిండిన బ్యూటీ ప్రొడక్ట్స్‌కు బదులుగా సహజమైన పదార్థాలను వాడాలనుకునే వారికి ఆవు నెయ్యి ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. సరైన విధంగా వాడితే చర్మానికి సహజమైన కాంతి రావడమే కాకుండా, చర్మంపై ఉండే ముడతలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఒత్తిడి, జీవనశైలిలో మార్పుల వల్ల చర్మం త్వరగా ముడతలు వస్తున్నాయి ప్రస్తుత కాలంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఆవు నెయ్యి చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఇది ఎంతో ఉపశమనం ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ముఖానికి మృదువుగా రాసుకుంటే, ఉదయం లేవగానే చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
ముఖ కాంతిని పెంచుకోవాలనుకునేవారు కూడా ఆవు నెయ్యిని ఉపయోగించవచ్చు. కొద్దిగా నెయ్యిలో పసుపు కలిపి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి అప్లై చేస్తే, మృత కణాలు తొలగిపోతాయి. దీంతో చర్మం మరింత మెరిసేలా మారుతుంది. వారంలో ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేయడం వల్ల ముఖంపై సహజమైన గ్లో కనిపిస్తుంది. అలాగే శనగపిండితో ఆవు నెయ్యిని కలిపి వాడితే స్క్రబ్‌లా పనిచేసి చర్మాన్ని శుభ్రం చేస్తుంది.
చలికాలంలో చేతులు, కాళ్లు పగిలిపోవడం చాలా సాధారణం. అలాంటి సమస్యలకు కూడా ఆవు నెయ్యి మంచి పరిష్కారం. రాత్రి పడుకునే ముందు చేతులు, కాళ్లకు నెయ్యి రాసుకుని నిద్రపోతే, ఉదయానికి పగుళ్లు తగ్గి చర్మం మృదువుగా మారుతుంది. పాదాల పగుళ్ల సమస్య ఉన్నవారు నెయ్యి రాసుకుని సాక్స్‌లు వేసుకుని నిద్రపోతే మంచి ఫలితం కనిపిస్తుంది.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. సరైన నిద్ర లేకపోవడం, స్క్రీన్ టైమ్ ఎక్కువ కావడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో రాత్రి పడుకునే ముందు కళ్ల కింద స్వల్పంగా ఆవు నెయ్యితో మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. క్రమంగా నల్లటి వలయాలు తగ్గుతాయి. అలాగే పెదాలు పగిలిపోతే, లిప్ బామ్‌కు బదులుగా ఆవు నెయ్యిని రాసుకుంటే సహజంగా నయమవుతాయి.
సహజ సౌందర్య రహస్యం ఖరీదైన క్రీములు, లోషన్లు కాకుండా, ఇంట్లోనే లభించే ఈ సహజ పదార్థాన్ని సరిగ్గా వాడితే చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుంది. అయితే ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, ఆర్గానిక్ ఆవు నెయ్యినే ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సహజ మార్గంలో అందాన్ని పెంచుకోవాలనుకునేవారికి ఆవు నెయ్యి నిజంగా ఒక వరంలాంటిదని చెప్పుకోవచ్చు.