చైనాలో ఒక అరుదైన ఘటన తాజాగా వార్తల్లో వైరల్ అయింది . 59 ఏళ్ల వయసులో ఉన్న ఓ మహిళ ఐవీఎఫ్ చికిత్స ద్వారా శిశువుకు జన్మనిచ్చి తన నగరంలోనే అత్యంత వయసైన తల్లిగా గుర్తింపు పొందింది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఉన్న జాంగ్జియాగాంగ్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ వార్త అక్కడి ప్రజలతో పాటు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చకు దారితీసింది.
స్థానిక కథనాల ప్రకారం.. ఈ మహిళ ఇంటిపేరు జౌ. ఆమెకు ఇప్పటికే ఒక కుమార్తె ఉంది. అయితే ఆ కుమార్తె ఉద్యోగం నిమిత్తం విదేశాల్లో స్థిరపడింది. కాలక్రమంలో ఇంట్లో తాను, తన భర్త మాత్రమే ఉండటంతో ఇద్దరికీ ఒంటరితనం ఎక్కువగా అనిపించిందని జౌ తెలిపింది. ఈ ఒంటరితనమే మరోసారి తల్లి కావాలనే ఆలోచనకు కారణమైందని ఆమె భావోద్వేగంగా చెప్పింది.
రెండేళ్ల క్రితం ఈ నిర్ణయం తీసుకున్న జౌ, ముందుగా తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించింది. వయసు ఎక్కువ కావడంతో సహజ గర్భధారణ సాధ్యం కాదని వైద్యులు సూచించడంతో, ఆమె ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించింది. గత ఏడాది ఆమె ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది. ఇది తెలిసిన వెంటనే ఆస్పత్రి వైద్యులు ఆమెను హై రిస్క్ గర్భిణిగా గుర్తించి, ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.
జనవరి 9వ తేదీన జాంగ్జియాగాంగ్ నంబర్ వన్ పీపుల్స్ హాస్పిటల్‌లో సిజేరియన్ ద్వారా ఆమె ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు బరువు సుమారు 2.2 కిలోలుగా నమోదు అయింది. శిశువు ఏడుపు వినగానే తన కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయని, ఆ క్షణాన్ని మాటల్లో చెప్పలేనని జౌ వెల్లడించింది. మరోసారి తల్లి కావాలనే తన కల నిజమవుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆమె చెప్పింది.
వైద్యుల ప్రకారం, 59 ఏళ్ల వయసులో గర్భధారణ చాలా ప్రమాదకరమైంది. రక్తపోటు, కిడ్నీ సమస్యలు, శరీరంలో వాపులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు గర్భధారణ సమయంలో జౌను ఇబ్బంది పెట్టాయి. రక్తంలో ఆల్బ్యుమిన్, యూరిక్ యాసిడ్ స్థాయులు పెరగడంతో పాటు, కాళ్లలో తీవ్రమైన వాపు కూడా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో గర్భాన్ని ఎక్కువ రోజులు కొనసాగించడం సురక్షితం కాదని వైద్యులు నిర్ణయించారు.
33 వారాలు 5 రోజుల గర్భకాలం పూర్తయ్యాక సిజేరియన్ చేయాలని వైద్య బృందం నిర్ణయించింది. సీనియర్ గైనకాలజిస్ట్ గుఒ హుయ్‌పింగ్ మాట్లాడుతూ, ఇంతటి ప్రమాదాల మధ్య కూడా ధైర్యంగా ముందుకు వచ్చిన జౌ నిజంగా అభినందనీయురాలని అన్నారు. గర్భకాలం మొత్తం వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, తరచూ ఫోన్ సందేశాల ద్వారా సూచనలు ఇచ్చేవారని జౌ తెలిపింది. తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని ఆమె భావోద్వేగంగా చెప్పింది.
ఈ ఘటన చైనాలో మరోసారి వృద్ధ వయసులో మాతృత్వంపై చర్చకు దారితీసింది. కొందరు దీనిని ధైర్యమైన నిర్ణయంగా అభివర్ణిస్తే, మరికొందరు ఆరోగ్యపరమైన ప్రమాదాలను గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా, జౌ కథ మాత్రం తల్లితనానికి వయస్సు అడ్డుకాదని చెప్పే ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది.