వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 వేదికపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. భారత దేశంలో అడుగుపెట్టేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెనకాడుతుండటంతో, టోర్నీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అప్రమత్తమైంది. ఒకవేళ పాకిస్థాన్ తప్పుకుంటే, వారి స్థానంలో బంగ్లాదేశ్‌ను తిరిగి టోర్నీలోకి తీసుకునేందుకు 'స్టాండ్‌బై' ఏర్పాట్లు చేస్తుందని సమాచారం.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్ వెళ్లాలా? వద్దా? అనే అంశంపై సోమవారం లాహోర్‌లో హైడ్రామా నడిచింది. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, పాక్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. భద్రతా కారణాల రీత్యా భారత్‌లో ఆడటంపై ప్రధాని సలహా కోరారు. ఈ భేటీ తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుందని అంతా ఆశించారు. అయితే, నఖ్వీ తన 'X' (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. తుది నిర్ణయం తీసుకోవడంలో మరింత జాప్యం జరుగుతుంది అని పేర్కొన్నారు. దీంతో పాక్ ఆటగాళ్ల వీసాలు, ప్రయాణ ఏర్పాట్లపై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది.
నిజానికి భద్రతా కారణాల సాకుతో భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌ను ఐసీసీ గత వారమే టోర్నీ నుండి తప్పించింది. జనవరి 24న బంగ్లాదేశ్ స్థానంలో 'గ్రూప్-సి'లో స్కాట్లాండ్‌ను చేర్చింది. అయితే, ఇప్పుడు పాకిస్థాన్ కూడా ఇదే తరహా మొండివైఖరి ప్రదర్శిస్తుండటంతో.. టోర్నీలో జట్ల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు బంగ్లాదేశ్‌ను మళ్లీ పిలిచే అవకాశం ఉందని సమాచారం. పాక్ గనుక చివరి నిమిషంలో తప్పుకుంటే, ఆ ఖాళీని బంగ్లాదేశ్‌తో భర్తీ చేయాలని ఐసీసీ భావిస్తోంది.
షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మెగా టోర్నీని వేదిక మార్చడం సాధ్యం కాదని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్‌లో టోర్నీ నిర్వహణకు అన్ని దేశాలు అంగీకరించినప్పుడు, కేవలం ఒకటి రెండు దేశాల కోసం నిబంధనలు మార్చలేమని తేల్చి చెప్పింది. ఒకవేళ పాకిస్థాన్ తప్పుకుంటే, అది వారి క్రికెట్ భవిష్యత్తుపై మరియు ఐసీసీ నుండి వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు..
క్రికెట్ మైదానంలో జరగాల్సిన పోరాటం ఇప్పుడు దౌత్యపరమైన చర్చల స్థాయికి చేరింది. పాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేక పంతానికి పోయి ప్రపంచకప్‌ను వదులుకుంటుందా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఒకవేళ పాక్ తప్పుకుంటే, అది క్రికెట్ అభిమానులకు పెద్ద నిరాశే మిగులుస్తుంది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు.