జనవరి 26నే రాజ్యాంగం ఎందుకు అమలు చేశారు..
రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన తెలుగు వీరులు..
2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల శ్రమ..
ఆగస్టు 15న దేశ ప్రధాని జెండాను ఎగురవేస్తారు. ఈ రోజున జెండాను కింద నుంచి పైకి లాగి (Flag Hoisting) ఎగురవేస్తారు. దీనిని స్వాతంత్ర్య సముపార్జనకు చిహ్నంగా భావిస్తారు. అదే జనవరి 26న రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు (Flag Unfurling). ఈ రోజున జెండా అప్పటికే పైన కట్టి ఉంటుంది, కేవలం దానిని విప్పి ఆవిష్కరిస్తారు.
1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ పరిపాలన కోసం ఒక పటిష్టమైన చట్టం అవసరమైంది. ఇందుకోసం రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. ఇందులో 299 మంది సభ్యులు ఉండేవారు. వీరు ప్రాథమిక హక్కులు, న్యాయవ్యవస్థ వంటి వివిధ అంశాల కోసం 22 కమిటీలుగా విడిపోయి, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు.
1950 జనవరి 26నే రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఒక చారిత్రక కారణం ఉంది. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా 'సంపూర్ణ స్వరాజ్యం' తీర్మానాన్ని చేసింది. ఆ రోజు గుర్తుగా, సరిగ్గా 20 ఏళ్ల తర్వాత 1950లో అదే రోజున మన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నాము.
అన్ని కమిటీలలో ముసాయిదా కమిటీ (Drafting Committee) అత్యంత కీలకమైనది. దీనికి అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు 10 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, మన దేశానికి అనువైన అంశాలను క్రోడీకరించారు. అమెరికా నుండి ప్రాథమిక హక్కులు, ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు వంటి అనేక అంశాలను సేకరించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు.
మన రాజ్యాంగ రూపకల్పనలో తెలుగు వారు కూడా కీలక పాత్ర పోషించారు. పటాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, బెజవాడ గోపాలరెడ్డి మరియు టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ప్రముఖులు రాజ్యాంగ పరిషత్‌లో సభ్యులుగా ఉండి మన దేశ భవిష్యత్తును నిర్దేశించే చట్టాల తయారీలో తమ వంతు సహకారాన్ని అందించారు.