తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత డిజిటల్‌గా మార్చిన అధికారులు, తాజాగా మరో కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. షోరూమ్‌ల వద్దే వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఇప్పుడు వాహన యజమానులు తప్పనిసరిగా తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అకౌంట్ నంబర్ నమోదు చేయకపోతే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ పత్రాలు అప్‌లోడ్ కావడం లేదని షోరూమ్ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో వాహనం కొనుగోలు చేసే ప్రతి ఒక్కరి నుంచి బ్యాంక్ వివరాలు సేకరించాల్సి వస్తోందని వారు వెల్లడిస్తున్నారు.
ఈ పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇటీవల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలను నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేసే ‘ఆటో డెబిట్’ విధానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో పాటు ప్రస్తుతం బ్యాంక్ వివరాల సేకరణ జరగడంతో, ఇకపై ట్రాఫిక్ చలానాలు నేరుగా అకౌంట్ నుంచే కోత పడతాయన్న ప్రచారం ఊపందుకుంది. వాహన యజమానులు అనుమానాలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ప్రచారాన్ని రవాణా శాఖ అధికారులు ఖండిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలను చలానాల వసూలు కోసం గానీ, ఆటో డెబిట్ విధానం అమలుకు గానీ ఉపయోగించడం లేదని స్పష్టం చేస్తున్నారు. కేవలం చిరునామా ధ్రువీకరణ (Address Verification) కోసమే ఈ వివరాలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది వాహన యజమానులు ఇళ్లు మారినా, రవాణా శాఖ రికార్డుల్లో పాత చిరునామాలే కొనసాగుతున్నాయని, దీంతో అవసరమైన సందర్భాల్లో వారిని గుర్తించడం కష్టమవుతోందని పేర్కొంటున్నారు.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా వాహనానికి సంబంధించిన కీలక సమాచారం పంపాల్సిన సందర్భంలో సరైన చిరునామా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వివరిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ ఉంటే అందులో నమోదైన తాజా చిరునామా ఆధారంగా వాహన యజమానిని సులభంగా గుర్తించవచ్చని రవాణా శాఖ వాదిస్తోంది. ఆటో డెబిట్ అమలుపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాల్లో నిజం లేదని అధికారులు మరోసారి స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, ఈ కొత్త నిబంధనపై ప్రజల్లో స్పష్టత కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.