ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 4వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో 

4. ఓం సచ్చిదానంద స్వరూపిణ్యై నమః

సత్‌ + చిత్‌ + ఆనందము = సచ్చిదానందము.

అర్థం: సత్‌ అంటే సత్యం. ఎల్ల కాలాల్లో నిలిచి ఉండేది సత్యం. అది మారనిది. నాశనం లేనిది. పరమాత్మ సత్య స్వరూపుడు.

చిత్‌ అంటే చైతన్యం, జ్ఞానం, ప్రకాశం. దేనివలన ఈ సృష్టి మొత్తం  ఉనికిలో కొనసాగుతున్నదో అదే చైతన్యం. పరమాత్మ చైతన్య స్వరూపుడు.

ఆనందం అంటే పరిపూర్ణత్వం. ఎట్టి వెలితి లేనిది. నిండైనది.  అనంతమైనది. పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌  (ఆనందమే బ్రహ్మము) అని తైత్తిరీయోపనిషత్తు చెపుతుంది.

ఈ మూడు స్వభావాలు కలది శ్రీమద్భగవద్గీత. గీతా వాక్యానికి కాలధర్మం అనేది లేదు. అది సర్వకాల సర్వావస్థలలోనూ నిలిచి ఉంటుంది.

గీతావాక్యం అర్జునుని విషాదం, అజ్ఞానం తొలగించి, చైతన్యవంతుడిని చేసింది. అదే విధంగా మనలోని విషాదం, సందేహం తొలగించి, ఆత్మజ్ఞానం, ప్రకాశం కలిగించటమే గీత పరమార్థం.

గీతావాక్యం పరిపూర్ణమైనది. అందులో ఇది ఉన్నది, అది లేదు అన్న విచికిత్సకు తావు లేదు. అది సంపూర్ణమైనది. సర్వ సమగ్రమైనది. ఆనందదాయకమైనది.

సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ రూపమే అయిన గీతామాతకు ప్రీతితో నమోవాకం చేస్తున్నాను.

ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్ 

Link 1 : Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1

link 2 : Bhagavad Gita: పరమాత్మ శక్తిమంతుడు.. గీతామాత పరాశక్తి స్వరూపిణి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 2!

link 3 :Bhagavad Gita: అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు.. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 3!