ఓం వ్యాసదేవాయ నమః
ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 3వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళి
3. ఓం సద్గురు స్వరూపిణ్యై నమః
అర్థం: పరమాత్మ స్వరూపిణియైన శ్రీమద్భగవద్గీత సద్గురువు.
గుకారశ్చాంధకారస్తు
రుకారస్తన్నిరోధకృత్ ।
అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే ॥
- గురు గీత
అర్థం :‘గు‘ అనగా చీకటి. ‘రు’ అనగా దానిని నిరోధించేది. అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం అని తెలిపి, దాని నుంచి బయటపడటానికి శ్రేయస్కరమైన బోధ చేసేవారే సద్గురువు. గురువు సాక్షాత్తు త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ స్వరూపమే.
ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడ ఏ సద్గురువు ఆధ్యాత్మిక విద్యను బోధించినా ఆ విద్య భగవద్గీతా స్వరూపమే. ఇక్కడ వసిష్ఠగీత, గురు గీత, అష్టావక్ర గీత మొదలు అనేక గీతలు ఉన్నాయి. ఈ గీతలన్నీ ఎందరో మహర్షులు వారి వారి శిష్యులకు బోధించినవే. ఏ బోధ అయినా చక్కగా, శాస్త్ర ప్రమాణంగానే చేస్తారు సద్గురువు. గురువు శాస్త్ర స్వరూపం. శాస్త్రం గురు స్వరూపం.
ఇక్కడ ప్రామాణికమైన శాస్త్రం భగవద్గీత. వేదసారమైన భగవద్గీత భగవాన్ ఉవాచ. అంటే స్వయంగా ఆ తండ్రి ముఖారవిందం నుండి వచ్చింది. లోకమంతా నీవు అల్పుడివి అని చెపుతున్నప్పుడు, నా తల్లి శ్రీమద్భగవద్గీత, ‘నీవు అనంతమైన ఆత్మ స్వరూపానివి’ అని నన్ను నాకు పరిచయం చేసింది. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో బోధపరిచింది. అపారమైనది నా గురుమహిమ!
ఏదీ ఆశించకుండా, ఎల్లలు లేని పరిపూర్ణమైన ప్రేమతో జ్ఞానబోధ చేస్తున్న సద్గురు స్వరూపిణి అయిన నా తల్లికి వినయంతో వందనం చేస్తున్నాను.
ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
జై గురుదేవ్