ఓం వ్యాసదేవాయ నమః

ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆంధ్రప్రవాసి ధర్మబాధ్యతగా భావిస్తోంది.

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు  గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఒక్కో నామాన్ని ప్రతిరోజూ మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఈ రోజు నుండి ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

*శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి*

*1. ఓం శ్రీమద్భగవద్గీతా మాత్రే నమః*  

మాతృదేవో భవ । పితృదేవో భవ ।
ఆచార్యదేవో భవ । అతిథిదేవో భవ ।
  - తైత్తిరీయోపనిషత్తు, 1-11

తల్లిని దైవంగా భావించమని ఉపనిషత్‌ మహర్షుల వారు చెప్పారు. గీతామాత అందరికీ తల్లి. తల్లి దైవం గనుక, శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు దైవ స్వరూపమే. దైవం సమస్త సృష్టిని కాపాడుతుంది. అదే విధంగా గీతామాత మనల్ని దయగా, ప్రేమగా అక్కున జేర్చుకొని ఆదరిస్తుంది.  కన్నతల్లి ఈ దేహపోషణకు ఏది కావాలో అది పసితనం నుండి అందిస్తుంది. గీతామాత మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఏ యోగం నేర్వాలో, ఏ పూజ చెయ్యాలో, ఎట్టి ధ్యానం చెయ్యాలో. ఎటువంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి ఆలోచన చెయ్యాలో, ఎలా మాట్లాడాలో, ఏ తీరున ఉండాలో నేర్పుతూనే ఉంటుంది. జన్మనిచ్చిన తల్లి ఎప్పుడో ఒకప్పుడు దూరమవుతుంది. కాని గీతామాత తుది ఊపిరి వరకు మనతోనే ఉంటుంది. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు ఆచరింపజేస్తూ, పరమాత్మకు ప్రియమైన వారిగా మనల్ని తీర్చిదిద్దుతుంది.  

పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్‌
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్‌
అద్వైౖతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్‌
అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్‌

    -వైష్ణవీయ తంత్రసారము

అర్థం: భగవంతుడగు కృష్ణుడే స్వయంగా అర్జునునికి బోధించినది గీత. సనాతన మునీంద్రుడైన వేదవ్యాసునిచే మహాభారతం మధ్య కూర్చబడినది. అష్టాదశ అధ్యాయాలతో, అద్వైతామృతం కురిపిస్తూ, సంసారదుఃఖాన్ని శమింపజేస్తున్న గీతామాతా! నిన్ను ధ్యానిస్తున్నాను.

ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.