ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 42వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
42. ఓం సనాతన ధర్మ ప్రదాయై నమః
అర్థం: సదా భవః సనాతనః. అనగా ఎల్లప్పుడూ నిత్య నూతనంగా ఉండేది. దానికి ఏ విధంగా ఆది అనేది లేదో అదే విధంగా అంతమూ ఉండదు. సర్వకాల సర్వావస్థల్లో అది వర్ధిల్లుతూనే ఉంటుంది.
‘ధరతి విశ్వమితి ధర్మః’.
సమస్త విశ్వాన్నీ ధరించేది ధర్మం. విశ్వస్థితికి ఆధారమైనది ధర్మం. దానిని మనం ధరించాలి. అంటే ధర్మం తెలుసుకొని ప్రవర్తించటం. ధర్మ వర్తనం కలిగి ఉండటం.
‘ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః’ ।
- మహాభారతము, వనపర్వము, అ-313, శ్లో-128
అర్థం: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.
మనం కాపాడిన ధర్మం మనలను కాపాడుతుంది. ధర్మం అంటే న్యాయసమ్మతమైన బాధ్యత; మానవత్వాన్ని రక్షించేది; సత్యాన్ని కాపాడుకుంటూ ఉండే ఒక జీవనశైలి. శాంతి, దయ, అహింస, సత్యము, అస్తేయము, ఉపకారం, సహానుభూతి, శౌచము - ఇవన్నీ ధర్మానికి అవయవాలై ఉన్నాయి. అవ్యక్తం నుండి వ్యక్తమైన ప్రకృతి, సృష్టికి కావలసిన సమస్త ధర్మాలను ధరించి వ్యక్తమైంది. ఆ ధర్మాలే ఆధారంగా సృష్టి మొత్తం నడుస్తుంది. ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే, అది మనల్ని ధ్వంసం చేస్తుంది. ధర్మానికి భంగం కలిగినప్పుడు దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కావించి, ధర్మాన్ని పరిరక్షించటానికి భగవంతుడు అవతార పురుషుడై దిగివచ్చి కాపాడతాడు అని గీతావాక్యం.
పురాణ కథలో హరిశ్చంద్ర చక్రవర్తి ఆడిన మాట తప్పక రాజ్యాన్ని వదులుకొన్నాడు. భార్యా పుత్రులను కోల్పోయాడు. కాటి కాపరిగా అతి హీనమైన జీవితం గడిపాడు. అయినా సత్యమే జయించి, చివరికి సకల శుభాలు పొందాడు. ‘సత్యే ధర్మః ప్రతిష్ఠితః’. సత్యమునందు ధర్మం సుస్థిరంగా ఉంటుంది. అట్టి సత్యవిశిష్టత గురించి శ్రీమద్భగవద్గీత తెలియజేసింది.
సనాతన ధర్మం ఏదో ఒక కాలంలో పుట్టి మరొక కాలంలో పోయేది కాదు. అది శాశ్వతం. సనాతన ధర్మానికి ఆది, అంతం లేదు. ఆద్యంతాలు లేనిది పరమాత్మే గనుక సనాతన ధర్మం అంటే భగవత్ స్వరూపమే అని గ్రహించాలి. గీతాసారం సనాతన ధర్మమే.
శ్రేయాన్ స్వధర్మో విగుణః
పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయావహః ॥ 3.35
పర ధర్మం కంటే స్వధర్మం శ్రేష్ఠం, పర ధర్మ జీవనం కంటే స్వధర్మాచరణలో మరణమే మేలు. భయం, సంకోచం లేని స్వధర్మాచరణ జ్ఞానం వైపు నడిపిస్తుంది.
సర్వ ధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ ।
అహం త్వా సర్వ పాపేభ్యో
మోక్షయిష్యామి మాశుచః ॥ 18.66
దేహ ధర్మాలను, సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించి (అంటే వాటితో సంగమం లేకుండా) సర్వాధారుడనైన నన్ను శరణు వేడినప్పుడు (ఆత్మధర్మాన్ని ధారణ చేసినప్పుడు) అన్నిపాపాల నుండి బయటపడి, పునర్జన్మ లేకుండా ముక్తుడవు అవుతావని చెపుతున్నారు పరమాత్మ.
అట్టి సనాతన ధర్మం నాకు ప్రసాదించి, ధర్మమార్గాన నన్ను నడిపిస్తున్న గీతామాతకు కృతజ్ఞతాభావంతో కైమోడ్పు చేస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 41 : Bhagavad Gita: జననం మరణం అనివార్యం.. ఇది తెలిసినవాడు శోకించడు... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -41!
నామం 40 : Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!
నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!
నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!
నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!
నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!