ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 38వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
38. ఓం సకల శుభ ప్రదాయై నమః
భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః
- ఋగ్వేదము, 1-89
అర్థం: మా చెవులు ఎప్పుడూ శుభప్రదమైనదానిని వినును గాక! మా కన్నులు ఎప్పుడూ శుభప్రదమైన దానిని చూచును గాక!
భద్రం అంటే మంచిది - శుభకరము, శ్రేయోదాయకము, ఆశీర్దాయకము, మంగళకరము - అన్నీ అలా చూడమంటున్నారు. వినపడే, కనపడే గుణాలలో మంచి గురించి వినండి, మంచినే మాట్లాడండి, మంచినే చూడండి. అపుడు అలజడి, అశాంతి నుండి దూరమౌతామని మహర్షులు మన కందించిన సాధన విధానం. శాస్త్రం మనకు చెప్పిన శుభ వాసనలు ఇవి :
1. మైత్రి : స్నేహ భావన పెంపొందించుకోవాలి.
2. ముదిత : సంతోషంగా, సంతృప్తిగా ఉండాలి.
3. కరుణ : ఇక్కడ కనపడే విశ్వమంతా పరమాత్మ సృష్టి. విశ్వంలో ప్రతిదీ ఆయన అంశే. కనుక అందరి పట్ల కరుణతో ఉండాలి.
4. ఉపేక్ష : ఇదంతా మారేదే అన్న భావనతో ఓర్పుగా ఉండాలి. నీ ముందుకు ఏ క్లిష్ట విషయం వచ్చినా ఉపేక్షించాలి. అప్పుడే నీకు శ్రేయస్సు.
మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥ 7.7
అర్థం: నాకన్నా భిన్నంగా ఇక్కడ ఏమీ లేదు. మణులలో సూత్రం ఎలా ఉందో అ విధంగానే ఇక్కడ చూస్తున్న ప్రతి దానిలోనూ నేను వ్యాపించి ఉన్నాను అంటున్నారు పరమాత్మ. అంటే ఇక్కడ ఏది చూస్తున్నప్పటికీ అది పరమాత్మే.
అంతా నేనే అన్నప్పుడు ఈ అపర ప్రకృతిని ధరిస్తున్న పరమేశ్వరుని మంచిగా చూడగలుగుతున్నామా? చెడుకి ఆకర్షణ ఎక్కువ. మనకు మంచి చేసినవాళ్ళని మరిచిపోతాము. కాని చెడు చేసిన వాళ్ళని ఎప్పటికీ మరిచిపోము. మనస్సు, చిత్తము వాటిని గ్రహించి వాటితో రమించటానికి ఇష్టపడుతుంది. ప్రతికూల భావాలు చిత్తంలో నిక్షిప్తం అయి బాధ పెడుతుంటాయి. ‘యో మాం పశ్యతి సర్వత్ర’ అన్నట్లు అన్నిటా అంతటా మంచినే చూస్తూ ఉంటే పరమాత్మకు దగ్గరవుతాము. ఈ సమస్యల నుండి, దుఖం నుండి, కలతలు కల్లోలాల నుండి బయటపడతాము. మంచిని చూడటం అన్నది ఒక తాళపు చెవి. దానితో జ్ఞానమనే ఖజానా తెరుచుకుంటుంది. అదే శుభదృష్టి.
శుభాశుభాలు తెలియని నాకు శుభమేదో తెలియజేసి, కోరకుండానే సకల శుభాలను నాకు ప్రసాదిస్తూ నన్ను శుభ స్వరూపునిగా తీర్చిదిద్దుతున్న గీతామాతకు ప్రసాదబుద్ధితో ప్రణామం చేస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!
నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!
నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!
నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!