ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 8వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
8. ఓం సకల తీర్థ స్వరూపిణ్యై నమః
అర్థం: ఇక్కడ పుణ్య క్షేత్రాలు, పుణ్య తీర్థాలు ఉన్నాయి. భూమిపైన అంటే నేలపై గాని, కొండలపై గాని, అడవుల్లో గాని వెలసిన దైవ ప్రదేశాలను క్షేత్రాలు అంటారు. క్షేత్రాలలో కోనేరు లేదా పుష్కరిణి ఉంటుంది. అందులో స్నానమాడిన పిమ్మట దైవదర్శనం చేయటం ఆచారం. ఉదా॥ తిరుపతి, కోటప్ప కొండ మొదలైనవి.
నదీ తీరాన వెలసిన వాటిని పుణ్యతీర్థాలు అంటారు. ఉదా॥ కాశి, శ్రీశైలం, భద్రాచలం, అమరావతి మొదలైనవి.
తీర్థాలలో స్నానమాడి దైవదర్శనం చేసుకోవటం వల్ల పాపాలు పోతాయని పెద్దల మాట. అయితే మనో వాక్కాయ కర్మల ద్వారా ఎన్నో పాపాలు చేస్తుంటాము. మరి ఎల్లప్పుడూ తీర్థాలు తిరుగుతూ, నదులలో స్నానాలు చేస్తూ, పాపాలు కడుక్కొంటూ ఉండటం సాధ్యమేనా? ఆయా తీర్థాల, క్షేత్రాల వైభవం అంతా భగవద్గీతలో నెలకొని ఉంది.
మల నిర్మోచనం పుంసాం
గంగా స్నానం దినే దినే ।
సకృత్ గీతాంభసి స్నానం
సంసార మల మోచనమ్ ॥
- స్కాంద పురాణము
అర్థం: ప్రతి దినం చేసే గంగానదీ స్నానం మనుజులకు శరీర మాలిన్యం పోగొడుతున్నది. కాని భగవద్గీత అనే జలంలో చేసే ఒకే ఒక్క స్నానం సంసార మాలిన్యం అంతటినీ తుడిచిపెడుతున్నది. గంగలో చేసేది జలస్నానం. గీతలో చేసేది జ్ఞానస్నానం.
గీతాయాః పుస్తకం యత్ర
యత్ర పాఠః ప్రవర్తతే ।
తత్ర సర్వాణి తీర్థాని
ప్రయాగాదీని తత్ర వై ॥
- వరాహ పురాణము
అర్థం: ఎక్కడైతే శ్రీమద్భగవద్గీత నిత్యం పఠించబడుతుందో, అక్కడ ప్రయాగ మొదలైన సమస్త తీర్థాలు నెలకొని ఉంటాయి.
సర్వతీర్థాల స్వరూపమైన శ్రీమద్భగవద్గీతకు ప్రీతితో ప్రణమిల్లుతున్నాను.
ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 7 : Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!