టాలీవుడ్ వెండితెరపై గత దశాబ్ద కాలంగా ఊరిస్తున్న భారీ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్‌స్టార్ మహేష్ బాబుల కలయికే. ఈ కలయిక కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పే ఒక 'గ్లోబల్ ఎపిక్'గా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను రాజమౌళి అంతర్జాతీయ మీడియా వేదికగా పంచుకున్నారు.
రాజమౌళి, మహేష్ బాబుల కాంబినేషన్ నేడు నిన్నటిది కాదు. వీరిద్దరూ కలిసి పనిచేయాలని 2010లోనే నిర్ణయించుకున్నారు. అప్పట్లోనే కథా చర్చలు మొదలైనప్పటికీ, రాజమౌళి వరుస ప్రాజెక్టుల కారణంగా ఇది వాయిదా పడుతూ వచ్చింది. దీనిపై జక్కన్న స్పందిస్తూ.. మహేష్‌తో సినిమా చేయాలని 15 ఏళ్ల కిందటే అనుకున్నాను. కానీ ఈగ సినిమాకు ఆరు నెలలు అనుకుంటే రెండేళ్లు పట్టింది, 'బాహుబలి'కి ఐదేళ్లు, 'RRR'కు మరో ఐదేళ్లు సమయం పట్టింది. ఇలా నా కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయ్యేసరికి ఇంత కాలం పట్టింది అని వివరించారు. ఈ నిరీక్షణే ఇప్పుడు సినిమాపై ఆకాశమంత అంచనాలను పెంచిందని తెలిపారు.
ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్‌ను ఖరారు చేయడమే కాకుండా, ఇందులో భారతీయ ఇతిహాసమైన రామాయణంలోని ఒక భాగాన్ని స్పృశించబోతున్నట్లు రాజమౌళి హింట్ ఇచ్చారు. హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాల తరహాలో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని సమాచారం. ఇప్పటికే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరియు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలను విదేశాల్లోని దట్టమైన అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమా కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపిస్తున్న ఆయన లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026 ఏప్రిల్ 7న ఉగాది పండుగ కానుకగా ఈ చిత్రాన్ని 'పాన్ వరల్డ్' స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
నేటి కాలంలో ప్రేక్షకులు మూడు గంటల సినిమాను చూడలేరనే వాదనను రాజమౌళి తోసిపుచ్చారు. సినిమా గ్రిప్పింగ్‌గా ఉంటే ప్రేక్షకుడు ఫోన్ వైపు చూడడు. 'వారణాసి' దాదాపు మూడు గంటల నిడివితోనే ఉంటుంది. ప్రేక్షకుడిని సీటులో కూర్చోబెట్టేలా సినిమాను మలచడం ఒక సవాల్, ఆ సవాల్‌ను నేను స్వీకరించాను అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథ ఈ సినిమాకు ప్రధాన బలాలు కానున్నాయి.