ఉదయం లేవగానే ఏమి తినాలి అనేది చాలా మందికి సందేహమే. చాలామంది పండ్లను తీసుకుంటారు అందులో జామ పండు చాలా ఉపయోగకరమని వైద్యులు అంటున్నారు. చిన్నప్పుడు ఇంటి దగ్గరే ఉండే చెట్ల దగ్గర తినే ఈ జామ, రుచికరమేకాక శరీరానికి మంచి శక్తిని కూడా ఇస్తుంది. తాజా పరిశోధనలు చెబుతున్నట్టుగా ఉదయం ఖాళీ కడుపుతో జామ తింటే ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయో తెలుసుకోండి మరి.
జామలో ఉన్న పీచు కడుపు శుభ్రం అయ్యేలా చేయడమే కాక జీర్ణక్రియను బలపడేలా చేస్తుంది. తరచూ అజీర్ణం, కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం ఉన్నవారికి ఉదయం ఒక జామ చాలా రిలీఫ్ ఇస్తుంది. సహజంగా జీర్ణశక్తిని మెరుగుపరచే ఎంజైములు జామలోనే ఉంటాయి కాబట్టి రోజు ప్రారంభం జామతో చేస్తే కడుపు తేలికగా ఉంటుంది.
జామలో విటమిన్ C చాలా ఎక్కువ సాధారణంగా ఒక జామ తింటే రోజుకు కావాల్సిన విటమిన్ C కంటే రెట్టింపు దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు, సీజనల్ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తిన్నప్పుడు ఈ విటమిన్ మరియు పోషకాలు శరీరంలో త్వరగా శోషించబడతాయి.
షుగర్ ఉన్న వాళ్లకు కూడా జామ మంచి ఫలమే తీపి ఉన్నా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆప్షన్. ఎందుకంటే ఇది కడుపు నిండిన భావాన్ని ఇస్తుంది స్నాక్స్ తినాలన్న కోరిక తగ్గిపోతుంది.
చర్మానికి జామ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం జామ తింటే చర్మం సహజంగా ప్రకాశిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే హానికరమైన పదార్థాలను బయటకు పంపించి ముఖానికి గ్లో ఇస్తాయి. అలాగే కొల్లాజెన్ పెరిగి ముడతలు తగ్గుతాయి.
హృదయానికి కూడా జామ మంచి స్నేహితుడు ఇందులో పొటాషియం, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి హార్ట్ హెల్త్ మెరుగుపడుతుంది. అయితే చాలా సున్నితమైన కడుపు ఉన్నవారు ఒకేసారి ఎక్కువగా తినకూడదు. మొదట చిన్న ముక్కతో మొదలుపెట్టి శరీరం ఎలా స్పందిస్తుందో చూసుకోవడం మంచిది.
జామను ఇలా సాదాసీదాగా తిన్నా మంచిదే, లేదంటే జ్యూస్, స్మూతీ, సలాడ్‌లలో కూడా వేసుకుని తినవచ్చు. చిన్న పండుగానే కనిపించినా ఉదయం దీన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.