మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు మెండుగా ఉంటాయి. మునగాకు పొడి ఈ పోషకాలను సులభంగా పొందడానికి ఉత్తమ మార్గం. రోజూ కేవలం ఒక టీస్పూన్ మునగాకు పొడి తీసుకోవడం ద్వారా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలను నియంత్రించడంలో వైద్యులు కూడా మునగాకు పొడిని ఉపయోగించమని సూచిస్తున్నారు.
మునగాకు పొడి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి, బీపీతో బాధపడుతున్నవారికి ఇది ప్రభావవంతమైన ఔషధం లాంటిది. రక్త ప్రసరణ మెరుగుపడడంతో గుండె సమస్యలు తగ్గుతాయి.
చర్మ సంరక్షణలో కూడా మునగాకు పొడి చాలా ఉపయోగకరం. ఈ పొడి లో రోజ్ వాటర్ కలిపి మచ్చలు, మొటిమలపై రాస్తే నల్లదనం తగ్గుతుంది. మునగాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేందుకు సహాయపడతాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా కాపాడే సహజ సమ్మేళనం ఇది.
మునగాలో మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తం తయారవటం మెరుగుపడుతుంది. రక్తహీనత, అలసట, బలహీనతల సమస్యలతో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల సీజనల్ ఇన్‌ఫెక్షన్లు, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
మునగాకు పొడిలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. చిన్నారులు కూడా పరిమితంగా మునగాకు పొడి తీసుకోవచ్చు. ఏ ఆహార పదార్థంతోనైనా కలిపి తినొచ్చు. నిపుణుల ప్రకారం, పరిమిత మోతాదులో మునగాకు పొడిని రోజూ వాడితే శరీరానికి సమగ్ర ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.