ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. రైతుల ఆర్థిక భరోసా కోసం అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రెండో విడత నిధులను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా కమలాపురంలో జరిగే సభలో ఈ నిధులను ప్రత్యక్షంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకం కింద తన వంతు నిధులను విడుదల చేయనుంది. కేంద్రం జమ చేసే రూ.2 వేలు, రాష్ట్రం అందించే రూ.5 వేలు కలిపి ప్రతి రైతుకు మొత్తం రూ.7 వేలు అందనున్నారు. ఈ విడత ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది రైతులు లాభం పొందుతారని అధికారులు తెలిపారు.
అన్నదాత సుఖీభవ పథకంలో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా అర్హులైన కొందరు రైతుల ఖాతాల్లో నిధులు చేరలేని సమస్యలు ముందుగా నిలిచాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తోంది. రైతులు తమ పత్రాల వివరాలను సరిచేసుకుని, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే పథకం ప్రయోజనం పొందవచ్చని అధికారులు తెలిపారు. గ్రామ, మండల రెవెన్యూ కార్యాలయాల్లోని సిబ్బందిని సంప్రదించి భూమి, ఆధార్, బ్యాంక్ వివరాల్లో ఉన్న తప్పులను వెంటనే సరిచేయాలని సూచించారు. అదేవిధంగా అర్హులైన రైతులు మరణించిన పక్షంలో, వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేయించి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఏ రైతు పేరు జాబితాలో లేకపోతే, సమీపంలోని రైతు సహాయక కేంద్రాల్లో వివరాలు తెలుసుకుని సరిచేసుకోవాలని స్పష్టం చేశారు.
గతంలో ఈ పథక అమల్లో అనేక సమస్యలు ఎదురయ్యాయి. భూ యజమానులు మరణించిన తర్వాత వారి పేర్లు జాబితాల నుంచి తొలగించడంతో వారసులకు పాసుపుస్తకాలు ఇవ్వడంలో ఆలస్యం ఏర్పడింది. వెబ్‌ల్యాండ్‌లో పట్టా వివరాలు తప్పుగా నమోదు కావడం, భూమికి ఆధార్ అనుసంధానం లోపించడం, ఖాతాలు ఎన్‌పీసీఏలో ఇన్‌యాక్టివ్‌గా ఉండటం వంటి సమస్యలు వేలాది మంది రైతులు పథకం ప్రయోజనం పొందడంలో ఆటంకంగా మారాయి. అదనంగా, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయేతర పనుల కోసం వాడే భూమి యజమానులు, ఆక్వా సాగు చేసే వారు, 10 సెంట్లలోపు భూమి ఉన్నవారు మరియు మైనర్లు ఈ పథకం కోసం అనర్హులుగా గుర్తించబడ్డారు. ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులకు కూడా నిధులు అందకపోవడం వల్ల ప్రభుత్వం అన్ని అడ్డంకులను తొలగించేందుకు చర్యలు వేగవంతం చేసింది.
పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తీసుకుంది. కేంద్రం ఇచ్చే రూ.6 వేల రూపాయలతో పాటు, రాష్ట్రం అదనంగా రూ.14 వేలు చెల్లిస్తోంది. కేంద్రం మూడు విడతల్లో ఒక్కొక్కటికి రూ.2 వేల చొప్పున రూ.6 వేలు జమ చేస్తే, రాష్ట్రం మొదటి రెండు విడతల్లో ఒక్కోసారి రూ.5 వేల చొప్పున రూ.10 వేలు, చివరి విడతలో రూ.4 వేల చెల్లిస్తుంది. ఈ సమగ్ర సాయంతో రైతుల ఆర్థికభారం తగ్గించడంతో పాటు, సాగు పెట్టుబడులకు ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ చర్యల ద్వారా రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయాభివృద్ధి సాధించడం ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.