మీరు సొంతంగా కారు లేదా బైక్ వాడుతున్నారా? లేక రవాణా రంగంలో ఉన్నారా? అయితే ఈ వార్త మీకోసమే. కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన వాహనదారులపై కేంద్ర ప్రభుత్వం నిబంధనల కొరడా ఝుళిపించబోతోంది. రోడ్డు భద్రతను పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం మరియు ట్రాఫిక్ (Traffic new rules) నిబంధనలను పక్కాగా అమలు చేయడం కోసం ఫిబ్రవరి 1 నుండి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ నియమాలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఫాస్టాగ్ (FASTag) వాడే వారు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఫాస్టాగ్ (FASTag) రీఛార్జ్ నిలిపివేత: ఎందుకంటే?
ఇప్పటివరకు ఫాస్టాగ్ అంటే కేవలం టోల్ గేట్ల వద్ద డబ్బులు కట్టే సాధనం మాత్రమే. కానీ ఫిబ్రవరి 1 నుండి ఇది మీ వాహన డాక్యుమెంట్లకు 'రిపోర్ట్ కార్డ్' లాగా పనిచేస్తుంది.
ఇన్సూరెన్స్ మరియు పొల్యూషన్: మీ వాహనానికి సంబంధించి ఇన్సూరెన్స్ (బీమా) గడువు ముగిసినా లేదా పొల్యూషన్ సర్టిఫికేట్ (PUC) లేకపోయినా మీ ఫాస్టాగ్ రీఛార్జ్ అవ్వదు. అలాగే టోల్ ప్లాజాల వద్ద అది పనిచేయదు.
పెండింగ్ చలాన్లు: మీ వాహనంపై పాత ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉంటే, వాటిని క్లియర్ చేసేవరకు ఫాస్టాగ్ అకౌంట్ యాక్టివేట్ అవ్వదు.
జరిమానా: ఒకవేళ ఫాస్టాగ్ పనిచేయని స్థితిలో మీరు టోల్ ప్లాజాకు వెళ్తే, రెట్టింపు టోల్ ఫీజుతో పాటు భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది.
వాణిజ్య వాహనాలకు ట్రాకింగ్ డివైజ్ (VLTD) తప్పనిసరి..
ప్రయాణికుల భద్రత దృష్ట్యా, ప్రభుత్వం వాణిజ్య వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఏ వాహనాలకు?: టాక్సీలు, బస్సులు, వ్యాన్లు మరియు నేషనల్ పర్మిట్ ఉన్న ట్రక్కులకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (VLTD) ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి.
రిజిస్ట్రేషన్ కష్టమే: ఈ డివైజ్ లేని పక్షంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ చేయరు. అలాగే పాత వాహనాల ఫిట్‌నెస్ రెన్యూవల్ లేదా ఓనర్షిప్ ట్రాన్స్‌ఫర్ (పేరు మార్పిడి) కూడా అనుమతించబడదు. ఇది వాహనం ఎక్కడుందో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ఏప్రిల్ 1 నుండి చెకింగ్స్
ఏప్రిల్ 1వ తేదీ నుండి వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ అధికారులు నేరుగా వాహనాన్నిఅపి చెక్ చేస్తారు. ఇన్సూరెన్స్ ఇంకా చలాన్లు క్లియర్ ఉంటేనే పర్మిట్లు జారీ చేస్తారు.
స్పీడ్ లిమిట్ సహా జరిమానాలు
రోడ్లపై సూచించిన స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో వెళ్తే రూ.2,000 వరకు జరిమానా విధిస్తారు. అయితే, చాలా రోడ్లపై స్పీడ్ లిమిట్ బోర్డులు లేవని వాహనదారులు విమర్శిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం వెంటనే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒడిశా సహా భారతదేశం అంతటా సురక్షితమైన, పరిశుభ్రమైన, మరింత నిబద్ధతతో రోడ్డు రవాణా కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ కొత్త చర్యలు హైలైట్ చేస్తున్నాయి.
వాహనదారులు చేయాల్సిన పనులు:
కొత్త రూల్స్ వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ లోపే కొన్ని పనులు పూర్తి చేసుకోండి:
మీ ఇన్సూరెన్స్ గడువు ముగియకముందే రెన్యూవల్ చేసుకోండి.
చెల్లుబాటులో ఉన్న పొల్యూషన్ (PUC) సర్టిఫికేట్ దగ్గర ఉంచుకోండి.
మీ వాహనంపై ఏవైనా పెండింగ్ చలాన్లు ఉన్నాయేమో చెక్ చేసుకుని కట్టేయండి.
ఫాస్టాగ్ కేవైసీ (KYC) పూర్తి అయిందో లేదో ఒకసారి చూసుకోండి.