భారతీయ సంప్రదాయ వంటకాలలో కారం (Chilli nutrition facts) అనేది ఒక మమకారం అనేది చెప్పుకోవాలి. పప్పులో అయినా, కూరలో అయినా, చట్నీలో అయినా మిరపకాయ తప్పనిసరి. కానీ చాలా మందిలో ఒకే ప్రశ్న ఉంటుంది. పచ్చిమిర్చి తినడం మంచిదా? లేక ఎండు మిర్చి వాడడమే ఆరోగ్యానికి మేలా? ఈ రెండింటికీ ప్రత్యేకమైన లాభాలు ఉన్నాయి. మన అవసరం, ఆరోగ్య పరిస్థితిని బట్టి సరైనదాన్ని ఎంచుకోవడమే అసలు విషయం.
పచ్చిమిర్చి (Green chilli benefits) అంటే చాలామందికి కారం మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ నిజానికి ఇందులో పోషక విలువలు చాలా ఎక్కువ. పచ్చిమిర్చిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తరచూ జలుబు, దగ్గు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వస్తున్నవారు ఆహారంలో మితంగా పచ్చిమిర్చిని చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో శరీరంలో హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
పచ్చిమిర్చి మరో ముఖ్యమైన లాభం బరువు నియంత్రణ. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అదే సమయంలో మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి. అందుకే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు, డైట్ పాటిస్తున్నవారు పచ్చిమిర్చిని పరిమితంగా తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
ఇక ఎండు మిర్చి విషయానికి వస్తే, దీనిలో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థమే అసలు శక్తి. ఇదే మిర్చికి ఘాటు రుచిని ఇస్తుంది. ఈ క్యాప్సైసిన్ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అందుకే కొవ్వు సమస్యలు ఉన్నవారికి, సరైన మోతాదులో ఎండు మిర్చి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఎండు మిర్చిలో ( Red chilli health benefits)విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా దోహదపడుతుంది. వంటలకు మంచి రంగు, ఘాటైన రుచి ఇవ్వడంలో ఎండు మిర్చికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే అధికంగా తీసుకుంటే కడుపులో మంట, అసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే నిపుణులు చెబుతున్న ఒకే మాట ఏమిటంటే, ఏ మిరపకాయ అయినా మితమే మేలు. రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకునేవారు పచ్చిమిర్చిని ఎక్కువగా ఉపయోగించవచ్చు. (Weight loss foods) బరువు తగ్గాలనుకునేవారు, ఘాటు ఇష్టపడేవారు పరిమితంగా ఎండు మిర్చిని తీసుకోవచ్చు. తక్కువ కారం కావాలంటే పచ్చిమిర్చి సరైన ఎంపిక. ఎక్కువ స్పైసీ రుచి కావాలంటే ఎండు మిర్చి వాడవచ్చు.
ముఖ్యంగా మార్కెట్లో దొరికే కల్తీ కారం పొడులు, రసాయనాలు పూసిన పచ్చిమిర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవి తాత్కాలికంగా రుచి ఇచ్చినా, దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం. తాజా, శుభ్రమైన మిరపకాయలను ఎంచుకోవడం చాలా అవసరం. మొత్తంగా చెప్పాలంటే, పచ్చిమిర్చి, ఎండు మిర్చి (Green chilli benefits) రెండూ ఆరోగ్యానికి మిత్రులే. కానీ వాటిని ఎలా, ఎంత మోతాదులో తీసుకుంటున్నామన్నదే అసలు కీలకం.