రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూనే ప్రజలతో నేరుగా మమేకమయ్యే విధానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు. అధికార బాధ్యతల మధ్య కూడా ప్రజలకు సమయం కేటాయిస్తూ, వారి అవసరాలు, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం, జనవరి 6న అమరావతి సచివాలయంలో ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన ఎన్నారైలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆస్ట్రేలియా, అమెరికా, ఉగాండా, డెన్మార్క్ దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ఆత్మీయంగా పలకరిస్తూ, వారి కుటుంబ నేపథ్యం, వృత్తి జీవితాలు, వారు నివసిస్తున్న దేశాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఆసక్తిగా ఆరా తీశారు. ప్రవాసుల అనుభవాలను శ్రద్ధగా వింటూ, రాష్ట్రంతో వారి అనుబంధాన్ని మరింత బలపరచే దిశగా చర్చించారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా నుండి విజయ్ చెన్నుపాటి, సతీష్ గద్దే, మనోజ్ యండపల్లి, రంజిత్ కావూరి, భార్గవ దాసరి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకాగా, అమెరికా నుండి బొడ్డు మురళి, ఉగాండా నుండి గరికపాటి చిన్నా చౌదరి, నాగబాబు, డెన్మార్క్ నుండి పొట్లూరి అమర్నాథ్ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు.
సీఎం చంద్రబాబు తో ఎన్నారైలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక, అతిథ్య రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లో తొలి విమానం ల్యాండ్ అవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
వారి అభిప్రాయాలకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్నారైలు స్పష్టమైన, సమగ్రమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలతో రాష్ట్రానికి ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములవ్వడాన్ని ప్రభుత్వం హర్షిస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చూపిన ఆత్మీయత తమను ఎంతో ఆకట్టుకుందని, ఆయనతో నేరుగా మాట్లాడిన అనుభవం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేశారు.