జూన్ 2026 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు మరోసారి ఖర్చు భారం పెరగనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌లను మరోసారి గణనీయంగా పెంచే యోచనలో ఉన్నాయి. జూన్ 2026 నాటికి మొబైల్ సర్వీస్ రేట్లు సుమారు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత టారిఫ్ పెంపు తర్వాత సరిగ్గా రెండేళ్లకు ఈ పెరుగుదల ఉండటం గమనార్హం. దీంతో సాధారణ వినియోగదారులపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశముంది.
జెఫరీస్ ఈక్విటీ విశ్లేషకులు అక్షత్ అగర్వాల్, ఆయుష్ బన్సాల్ రూపొందించిన నివేదిక ప్రకారం, ఈ టారిఫ్ పెంపుకు ప్రధాన కారణం రిలయన్స్ జియో ప్రతిపాదిత ఐపీఓ అని పేర్కొన్నారు. జియో ఐపీఓ 2026 తొలిార్థంలో జరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఐపీఓ ద్వారా టెలికాం రంగంలో ఆదాయ వృద్ధిని వేగవంతం చేయాలన్నది కంపెనీల లక్ష్యంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. టారిఫ్‌లు పెంచడం ద్వారా రంగం మొత్తం విలువ పెరగడమే కాకుండా, పెట్టుబడిదారుల నమ్మకాన్ని కూడా బలోపేతం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
నివేదిక ప్రకారం, రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్‌లను 10 శాతం నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ప్రధానంగా తన విలువను ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్‌కు దగ్గరగా తీసుకురావడం, అలాగే పెట్టుబడిదారులకు రెండంకెల అంతర్గత రాబడిని (IRR) అందించడమే ఈ నిర్ణయానికి కారణమని జెఫరీస్ వెల్లడించింది. టారిఫ్‌ల పెంపు జియోకు మాత్రమే కాకుండా, మొత్తం టెలికాం రంగానికి ఆదాయ వృద్ధికి బలమైన పునాది వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ టారిఫ్ పెంపు టెలికాం కంపెనీల ఆర్థిక ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుందని నివేదిక అంచనా వేసింది. FY26తో పోలిస్తే FY27లో ఈ రంగం ఆదాయ వృద్ధి రేటు దాదాపు రెండింతలు పెరుగుతుందని తెలిపింది. FY26లో ఆదాయ వృద్ధి 7 శాతంగా ఉంటుందని అంచనా వేయగా, FY27లో ఇది 16 శాతానికి చేరుతుందని పేర్కొంది. జూన్ 2026లో జరిగే 15 శాతం టారిఫ్ పెంపు కారణంగా సగటు వినియోగదారుడి ఆదాయం (ARPU) FY27లో సుమారు 14 శాతం పెరిగే అవకాశముందని వెల్లడించింది. అయితే, అధిక టారిఫ్‌ల వల్ల కొత్త సబ్‌స్క్రైబర్‌ల చేరికల వేగం కొంత మందగించే ప్రమాదం ఉందని జెఫరీస్ హెచ్చరించింది.