భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతోంది. కొంతకాలంగా స్థిరంగా ఉన్న ధరలు తాజాగా మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. దీనివల్ల పసిడి ప్రియులకు అలర్ట్‌గా మారింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుండటం కూడా బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు దేశీయంగా పెట్టుబడుల డిమాండ్ పెరగడం వల్ల ఈ ధరల పెరుగుదల కొనసాగుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దగ్గర పడటంతో బంగారంపై ఆసక్తి మరింత పెరిగింది.
జనవరి 6 ఉదయం 6:30 గంటల సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,230కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,710గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,380గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,860కి చేరింది.
ఇతర ప్రధాన నగరాలైన విజయవాడ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ, పుణె తదితర ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. కొన్ని నగరాల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించినప్పటికీ, మొత్తం మీద దేశవ్యాప్తంగా పసిడి ధరలు పెరిగినట్టే కనిపిస్తున్నాయి.
మరోవైపు వెండి ధరలు కూడా జోరుగా పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కిలో వెండిపై సుమారు రూ.100 వరకు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,65,100గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రూ.2,48,100గా నమోదైంది. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.