రాష్ట్ర రాజకీయాల్లో మర్యాద, విలువలు, ప్రజాసేవే తెలుగుదేశం పార్టీ అసలైన విధానమని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు. మంత్రులతో జరిగిన అల్పాహార విందు భేటీలో ఆయన పార్టీ భవిష్యత్ దిశ, పాలనలో అనుసరించాల్సిన విధానాలు, ప్రజలతో మమేకమయ్యే తీరుపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. వైసీపీ అనుసరిస్తున్న దౌర్జన్య రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ పూర్తి భిన్నమని, బెదిరింపులు, రప్పా రప్పా సంస్కృతి తమకు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడమే పార్టీ తొలి బాధ్యత అని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో గెలిచామా లేదా అన్నదానికంటే, ప్రజలకు ఎంత సేవ చేశామన్నదే మన అసలైన అజెండా కావాలని మంత్రులకు సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల మధ్యే ఉండాలని, వారి సమస్యలను ప్రత్యక్షంగా వినాలని, పరిష్కారాల కోసం చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు రెండూ సమన్వయంతో అమలవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు. (TDP Leaders Meeting) వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో నేతలు సమర్థంగా వ్యవహరించాలన్నారు. అబద్ధాలను అబద్ధాలతో కాకుండా నిజాలతోనే తిప్పికొట్టాలని, ప్రజలకు నిజం చెప్పడంలో వెనుకాడొద్దని హితవు పలికారు.
ప్రజావేదికల (Andhra Pradesh Politics) ద్వారా వచ్చే ఫిర్యాదులను కేవలం నమోదు చేసి వదిలేయకుండా, వాటి పరిష్కార బాధ్యతను మంత్రులే స్వయంగా తీసుకోవాలని లోకేష్ స్పష్టం చేశారు. తమ శాఖలకు సంబంధించిన అర్జీలు పెండింగ్‌లో ఉండకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, అధికారులను సమన్వయంతో పనిచేయించే బాధ్యత మంత్రులదేనని చెప్పారు. ఒక్కో సమస్య పరిష్కారమే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీ బలోపేతానికి క్యాడర్ కీలకమని, వారిని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఇన్‌ఛార్జి మంత్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని లోకేష్ సూచించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, వారి సమస్యలు వినడం, అవసరమైన చోట అండగా నిలవడం ద్వారానే పార్టీ మరింత (TDP ) బలపడుతుందని అన్నారు. ప్రజల మద్దతుతో, కార్యకర్తల శ్రమతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని, ప్రజాసేవే తమ రాజకీయాల కేంద్రబిందువని నారా లోకేష్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు.