ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండం (Cyclone) గా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వాయుగుండం గురువారం నాటికి తీవ్ర వాయుగుండం (Severe Cyclonic Storm) గా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో ముఖ్యంగా శని, ఆదివారాల్లో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (AP Disaster Management) స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదే సమయంలో శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం ప్రధానంగా తమిళనాడు తీరం వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం పరిమితంగా ఉండొచ్చని తెలిపారు.
వర్షాల సూచన నేపథ్యంలో రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉన్న చలి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా, కొన్ని చోట్ల ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కనిపించే అవకాశముందని తెలిపారు. ఉష్ణోగ్రతలు కొంత పెరగడంతో చిన్నారులు, వృద్ధులకు ఉపశమనం లభించవచ్చని చెప్పారు.
మరోవైపు ఈ వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైతో పాటు తీరప్రాంతాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేశారు. ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అక్కడి అధికారులు సూచించారు.