కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్‌జీసీ (ONGC) మోరి–5 చమురు బావిలో చెలరేగిన భారీ అగ్నిప్రమాదం రెండో రోజు కూడా అదుపులోకి రాకపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం మధ్యాహ్నం బావిలో మరమ్మత్తుల పనులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా అధిక పీడనంతో గ్యాస్, ముడి చమురు ఒక్కసారిగా బయటకు రావడంతో భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఆకాశాన్ని తాకడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. బావి వద్ద పరిస్థితిని నియంత్రించేందుకు అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అంతర్జాతీయ స్థాయి నిపుణుల సహాయాన్ని కూడా తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. బావి చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేసి, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం భారీగా నీరు, మట్టి ఉపయోగించి మంటలను అదుపు చేసే ప్రయత్నం కొనసాగుతోంది.
మరోవైపు, మంటలను పూర్తిగా ఆర్పేందుకు ప్రత్యేక కూలెంట్ అవసరమని గుర్తించిన అధికారులు, రెండు లారీల్లో కూలెంట్‌ను ఘటన స్థలానికి తరలిస్తున్నారు. ఈ కూలెంట్ ద్వారా ఉష్ణోగ్రతను తగ్గించి బావిని చల్లబరిస్తే మంటల తీవ్రత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, నియంత్రణ దిశగా కొంత పురోగతి కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తిగా మంటలు ఆరడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.
ప్రమాద తీవ్రత దృష్ట్యా కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలంలోనే మకాం వేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఇరుసుమండ, మోరి గ్రామాలకు చెందిన సుమారు 500 కుటుంబాలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వారికి భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అమలాపురం ఎంపీ గంటి హరీశ్ బాలయోగి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.