గణతంత్ర వేడుకలకు తొలిసారి రాజధాని అమరావతి (Amaravati) వేదిక కాబోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల్ని ఏటా విజయవాడలో నిర్వహిస్తోంది. ఇకపై వీటిని అమరావతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 26న 77వ గణతంత్ర (Republic day) వేడుకల్ని రాజధానిలో తొలిసారి అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
రాజధాని పరిపాలన నగరంలో మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. మరో పదెకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసే బాధ్యతను సీఆర్డీఏకి అప్పగించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సహా 500 మంది ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. తొలిసారి గణతంత్ర వేడుకల్ని అమరావతిలో నిర్వహిస్తుండటంతో వాటిని తిలకించేందుకు రాజధాని గ్రామాల నుంచి, అటు గుంటూరు, ఇటు విజయవాడ నుంచి 10వేల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నెల 24న పూర్తిస్థాయి డ్రస్ రిహార్సల్స్ నిర్వహిస్తారు.
వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు వేర్వేరుగా బ్లాక్లు ఏర్పాటుచేస్తున్నారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా వాటర్ఫ్రూఫ్ షామియానాలు వేస్తున్నారు. వందేమాతరం, పది సూత్రాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతిబింబించేలా శకటాలు ఉంటాయి. మూడు ఉత్తమ శకటాలకు బహుమతులు అందజేస్తారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సీఎస్ కె. విజయానంద్ వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షించారు.
వేడుకల ప్రాంగణంలో తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్లు, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు లోక్భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం సహా ఇతర ప్రభుత్వ భవనాల్ని విద్యుద్దీపాలతో అలంకరించాలని ఆయన ఆదేశించారు. గణతంత్ర వేడుకలకు శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.