విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ పై విమర్శలు చేస్తూ, భారత్-రష్యా చమురు వ్యాపారంపై పాశ్చాత్య దేశాల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఇచ్చిన సమాధానం చాలా స్పష్టమైనది, ధైర్యవంతమైనది. “భారతీయ ఉత్పత్తులు మీకు నచ్చకపోతే కొనవద్దు. మేము ఎవరినీ బలవంతం చేయం” అనే ఆయన మాటలు భారత ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
2022లో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. యూరప్, అమెరికా దేశాలు రష్యా నుండి చమురు కొనుగోళ్లు ఆపేశాయి. ఆ సమయంలో భారత్ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుండి చమురు దిగుమతి చేయడానికి ముందడుగు వేసింది. జైశంకర్ చెప్పినట్లుగా, అదే నిర్ణయం భారత ప్రజలకు, అలాగే గ్లోబల్ మార్కెట్‌కు ఉపయోగపడింది. భారత్ పెద్ద మొత్తంలో రష్యా చమురు కొనుగోలు చేయడం వల్లే ధరలు కొంతవరకు స్థిరపడ్డాయి.
“భారత్ స్వతంత్ర దేశం. మేము మా నిర్ణయాలు మాకు అనుకూలంగా తీసుకుంటాం” అని జైశంకర్ ముక్కుసూటిగా చెప్పారు. ఈ మాటలు ఒక విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. భారత్ ఎవరికి అనుకూలంగా కాకుండా, తన జాతీయ ప్రయోజనాలు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆర్థిక, వ్యాపార నిర్ణయాలు తీసుకుంటుంది.
ట్రంప్, అలాగే అమెరికాలోని కొంతమంది నాయకులు భారత్‌పై టారిఫ్స్, వ్యాపార పరిమితులు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ జైశంకర్, “వాణిజ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సమస్యలు వస్తే వాటిని చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం. భారత్ ఉత్పత్తుల నచ్చకపోతే కొనవద్దు” అని స్పష్టం చేశారు.
జైశంకర్ వ్యాఖ్యలు ఒక దేశం తన ఉత్పత్తులపై గర్వపడే విధానాన్ని తెలియజేస్తున్నాయి. భారత్ ఇప్పుడు బతకడానికి ఎవరి సహాయం అవసరం లేదు” అనే స్థాయిలో ఉంది. స్థానిక ఉత్పత్తులను పెంచుతూ, ప్రపంచానికి ఎగుమతులు చేస్తూ దేశం ముందుకు సాగుతోంది. భారత్ ఉత్పత్తులను నిర్లక్ష్యం చేసే స్థితి ఇప్పుడు ఏ దేశానికీ లేదు. ఔషధాలు, ఐటీ, ఇంజనీరింగ్, టెక్స్టైల్స్, అగ్రికల్చర్ అన్నింటిలోనూ భారత్ ప్రభావం పెరుగుతోంది.
భారత్ జనాభా, మార్కెట్, మానవ వనరులు, ఆర్థిక శక్తి – ఇవన్నీ కలిపి ప్రపంచంలో ఒక అగ్రగామి స్థానాన్ని తీసుకొస్తున్నాయి. అలాంటి సమయంలో భారతదేశం తన ఉత్పత్తులను గౌరవించేలా ప్రపంచం మారాల్సిందే.
జైశంకర్ గారి స్పష్టమైన మాటలు మనందరికీ ఒక పెద్ద పాఠం చెబుతున్నాయి. మన ఉత్పత్తులపై గర్వపడాలి. ప్రపంచానికి తలవంచకుండా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా బలపడితేనే రాజకీయ పరంగా గౌరవం వస్తుంది.
“భారత ఉత్పత్తులు నచ్చకపోతే కొనకండి” అన్న మాటలు కేవలం ఒక సమాధానం మాత్రమే కాదు, దేశ ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రపంచ వేదికపై భారత్ తన స్థాయిని స్పష్టంగా తెలియజేస్తోందని ఇవి చెబుతున్నాయి. ప్రజల ప్రయోజనాలు ముందుండేలా, దేశం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటేనే నిజమైన ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుంది.