ఆంధ్రప్రదేశ్‌లో 2009 తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు తాజా తీర్పు షాక్ ఇవ్వనుంది. 2009 తర్వాత ఉద్యోగంలో చేరిన టీచర్లు తప్పనిసరిగా టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పాస్ కావాలి అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. పదోన్నతి పొందాలన్నా టెట్ తప్పనిసరి అని కోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ దీపాంకర్‌దత్త, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.
తమిళనాడులోని కేసుకు సంబంధించిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా వర్తించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. 2009కు ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ పాస్ అవ్వాలి. లేకపోతే ఉద్యోగం నుంచి తొలగించి, వారికి రావాల్సిన బెనిఫిట్స్ మాత్రమే ఇవ్వాలి అని కోర్టు ఆదేశించింది. అయితే, 2009 తర్వాత రిటైర్మెంట్‌కు ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి టెట్ అవసరం లేదు. కానీ పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు ముందే టెట్ పరీక్ష తప్పనిసరి చేస్తున్న సంగతి తెలిసిందే. టెట్ పాస్ అయిన వారికే డీఎస్సీ రాసే అర్హత ఉంది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో ఈ నిబంధన అందరి టీచర్లకు వర్తించనుందా? లేక ఏపీకి వేరు గానా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ తీర్పు ప్రభావం ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలపై కూడా చూపే అవకాశం ఉందని చెప్పబడుతోంది.