ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పెద్ద అడుగులు వేస్తోంది. ఆ లక్ష్యంతో అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ఇప్పటికే సీఆర్డీఏ 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ క్రమంలో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ను ప్రభుత్వ సంస్థగా ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఏక్యూసీసీలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చదరపు అడుగుకు కేవలం రూ.30 అద్దెతో ఐబీఎంకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. దీనికి ప్రతిగా ఐబీఎం, నాలుగేళ్లపాటు ప్రతి ఏడాది 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్ ప్రభుత్వానికి కేటాయించనుంది. ఈ సమయాన్ని విద్య, పరిశోధన, ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించనున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ లో 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 133 క్యూబిట్, 5కె గేట్స్ క్వాంటం కంప్యూటర్ ను ఏర్పాటు చేయనుంది.
ఇక రూ.4,000 కోట్లతో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026 జనవరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీని ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. జాతీయ క్వాంటం మిషన్‌లో భాగంగా ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నాయి. ఇందులో ఎల్‌అండ్‌టీ మౌలిక సదుపాయాలు, టీసీఎస్ హైబ్రిడ్ కంప్యూటింగ్ సొల్యూషన్లు అందిస్తే, ఐబీఎం దేశంలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది.