బంగారం ధరల్లో ఇవాళ ఊహించని మార్పు నమోదైంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కీలక సంకేతాలిచ్చిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ ప్రభావం దేశీయంగా కూడా కనిపించింది. ఇన్నాళ్లు తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఈ రోజు ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులకు సడెన్ షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రాత్రికి రాత్రే పెరగడం గమనార్హం.
అమెరికా ఫెడ్ ఛైర్మన్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముందని వెల్లడించడంతో బులియన్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగాయి. దీంతో అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1.02 శాతం అంటే 34.11 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ స్వచ్ఛమైన బంగారం ధర 3372 డాలర్లను దాటింది. మరోవైపు స్పాట్ సిల్వర్ కూడా ఔన్సుకు 2.08 శాతం పెరిగి 38.89 డాలర్ల వద్దకు చేరింది.
దేశీయంగా కూడా ఇదే ప్రభావం చూపింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1090 మేర పెరిగింది. దీంతో తులం ధర రూ.1,01,620కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1000 పెరిగి రూ.93,150కి చేరింది. ఈ పెరుగుదల బంగారం కొనుగోలు చేసేవారికి ఆర్థిక భారంగా మారింది.
బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయంగా ధరలు ఎగిసిపోవడంతో దేశీయ మార్కెట్లోనూ కిలో వెండి ధర రూ.2000 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,30,000కి చేరుకుంది. అయితే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి పెద్ద నగరాల్లో మాత్రం కిలో వెండి రేటు రూ.1.20 లక్షలకే లభిస్తోంది.
ఇకపోతే పసిడి, వెండి ధరలు రోజువారీగా మారుతుంటాయి. ఆగస్టు 24వ తేదీ ఉదయం 7 గంటలకు ఉన్న రేట్లు ఇవి. మధ్యాహ్నం తరువాత పరిస్థితులు మారవచ్చు. అలాగే రాష్ట్రాల వారీగా పన్నులు వేర్వేరుగా ఉండడంతో బంగారం ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు తాజా ధరలు తెలుసుకోవడం తప్పనిసరి.