ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణంపై తాజా అప్‌డేట్ వచ్చింది. వట్టిచెరుకూరు మండలంలో అధికారులు భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ రోడ్డుకు అవసరమైన పంట భూముల సర్వే నంబర్లు, ఎల్‌పీఎం వివరాలను సేకరిస్తున్నారు. చేబ్రోలు మండలం నుంచి వట్టిచెరుకూరులోకి ప్రవేశించే రోడ్డుకు సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అనంతవరప్పాడు, వింజనంపాడు, చమళ్లమూడి, కుర్నూతల, పుల్లడిగుంట, కొర్నెపాడు వంటి గ్రామాలపైగా రహదారి వెళ్లనుందని అధికారులు స్పష్టంచేశారు.
గతంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 70 మీటర్ల వెడల్పుతో నిర్మించాలనే ప్రణాళికలు ఉన్నప్పటికీ, రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు దీన్ని మరింత విస్తృతంగా అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, రహదారి వెడల్పును 140 మీటర్లకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. దీంతో భూసేకరణ పరిమాణం కూడా భారీగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాలను కలుపుతూ నిర్మించనున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 180 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. దీనికి అదనంగా రెండు లింక్ రోడ్లను నిర్మించి, విజయవాడ తూర్పు బైపాస్‌తో అనుసంధానం చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ రోడ్ నిర్మాణం పూర్తయితే అమరావతి పరిసర పట్టణాల మధ్య రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడతాయి.
ఔటర్ రింగ్ రోడ్ వెడల్పును 70 మీటర్ల నుంచి 140 మీటర్లకు పెంచడం వల్ల అవసరమయ్యే భూసేకరణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వానికే భారం కానుంది. అదనంగా సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. అయినప్పటికీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ వ్యయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు.
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, క్రికెట్ స్టేడియం వంటి మౌలిక సదుపాయాలు నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో, భారీ వాహన రాకపోకలకు తగినట్టుగా ఔటర్ రింగ్ రోడ్‌ను విస్తరించడం కీలకమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే అమరావతి అభివృద్ధి మరింత వేగం అందుకోనుంది.