ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణానికి మరింత వేగం చేరనుంది. నల్లపాడు–బీబీనగర్ మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 248 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు రూ.2,853 కోట్ల వ్యయంతో ఆరు దశల్లో పూర్తవనుంది. ఇప్పటికే విష్ణుపురం–కుక్కడం, కుక్కడం–వొలిగొండ మధ్య పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ నాటికి కనీసం 30 కిలోమీటర్ల పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ రైల్వే లైన్‌లో భాగంగా 10 పెద్ద బ్రిడ్జిలు, 259 చిన్న బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రెండో దశలో నల్లపాడు–బెల్లంకొండ మధ్య 56 కిలోమీటర్ల పనులకు టెండర్లు పిలవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం 200 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇందులో 135 హెక్టార్లు ఆంధ్రప్రదేశ్‌లో, 65 హెక్టార్లు తెలంగాణలో ఉన్నాయి.
ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ లైన్ ఉండటం వల్ల రైళ్లు ఎదురెదురుగా వస్తే ఒకదాన్ని స్టేషన్‌లో నిలిపి వేయాల్సి వస్తోంది. ట్రాక్ సామర్థ్యాన్ని మించి రైళ్లు నడవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని రెండో లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నుంచి సికింద్రాబాద్ కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇది ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా అందించనుంది. అదనంగా కొత్త రైళ్లు నడిపే అవకాశం కూడా ఉండటంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు, రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచనుంది. రాబోయే సంవత్సరాల్లో రైలు ప్రయాణానికి డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో, ఈ రెండో లైన్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.