గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలేంలో సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తిని భారీగా మోసం చేశారు. ట్రాఫిక్ చలానా పేరుతో హోటల్ నిర్వాహకుడు నిరంజన్ రెడ్డి మొబైల్‌కి శుక్రవారం రాత్రి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో “మీ వాహనంపై చలానా ఉంది, వెంటనే చెల్లించండి” అంటూ పోలీసులు పంపినట్లుగా APK ఫైల్ రూపంలో లింక్ పంపించారు.
నిరంజన్ రెడ్డి ఆ లింక్ క్లిక్ చేయడంతో యాప్ డౌన్‌లోడ్ అయింది. యాప్ తెరిచిన వెంటనే ఓటీపీ అడగడంతో అనుమానం వచ్చి ప్రాసెస్ మధ్యలోనే ఆపేశారు. అయితే శనివారం ఉదయం ఆయన క్రెడిట్ కార్డు నుంచి దఫాదఫాలుగా రూ.1.36 లక్షలు మోసగాళ్లు తీసుకున్నారు. ఆ డబ్బుతో ఆన్‌లైన్‌లో మొబైల్స్ కొనుగోలు చేసినట్లు మెసేజ్ వచ్చింది.
వెంటనే కార్డును బ్లాక్ చేసినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణలో మోసం మహారాష్ట్రకు చెందిన వ్యక్తి చేసినట్లు గుర్తించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.