ఆంధ్రప్రదేశ్ చేనేతలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. త్వరలోనే ‘నేతన్న భరోసా’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి ₹25,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఇదే కాకుండా రాష్ట్రంలోని దాదాపు 40 వేల సెలూన్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వం చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పవర్‌లూమ్స్‌కి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. అలాగే చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ భారాన్ని కూడా భరిస్తోంది. అదనంగా అమరావతిలో హ్యాండ్‌లూమ్ మ్యూజియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇక ఇప్పటికే తెలంగాణలో అమలులో ఉన్న నేతన్న భరోసా పథకానికి ₹48.8 కోట్లు కేటాయించగా, వీవింగ్‌తో పాటు డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, సైజింగ్, వైండింగ్ వంటి అన్ని రంగాల వారికి వర్తింపజేశారు. వార్షికంగా ₹25,000 పొందాలంటే మగ్గం జియోట్యాగ్ చేసి ఉండాలి, కనీసం ఏడాదికి 8–10 వార్పులు నేయాలని నిబంధనలు ఉన్నాయి. ఏపీలోనూ ఇలాంటి మార్గదర్శకాలు అమలయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. థ్రిఫ్ట్ ఫండ్ బలోపేతం, కొత్త పథకాల రూపకల్పన ద్వారా చేనేతలకు అండగా నిలుస్తామని ఏపీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది.