ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి (సెప్టెంబర్ 1) కొత్త బార్ పాలసీ అమలులోకి వచ్చింది. ఇది 2025 నుంచి 2028 వరకు మూడేళ్లపాటు కొనసాగుతుంది. ఈ కొత్త విధానం ప్రకారం బార్లు ఇకపై ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేయడానికి అనుమతి ఉంది. గతంలో రాత్రి 11 గంటలకు బార్లు మూసివేయాల్సి ఉండేది. కొత్త విధానం వల్ల ఒక గంట అదనంగా బార్లు తెరిచి ఉంచే అవకాశం కలిగింది.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో బార్లు ముందుగానే మూసివేయాల్సి వచ్చేది. కానీ కొత్త పాలసీతో ఇప్పుడు ముంబై, హైదరాబాద్, బెంగళూరుల తరహాలో ఏపీలో కూడా అర్ధరాత్రి 12 వరకు బార్లు నడిపే వీలుంది.
కొత్త బార్ పాలసీ ప్రకారం రూ.99కి అమ్మే క్వార్టర్ బాటిల్స్‌ను బార్లలో అమ్మే వీలు ఉండదు. గీతకార్మికులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 840 బార్లలో 84 బార్లను వారికి కేటాయించారు. లాటరీ విధానం ద్వారా లైసెన్సులు ఇచ్చే ప్రణాళిక ఉంది. అయితే దరఖాస్తులు తక్కువగా రావడం వల్ల లాటరీ ఎప్పుడు జరుగుతుందో అనుమానంగా మారింది.