ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) యువతకు ఉచిత హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణను అందించబోతోంది. ఈ శిక్షణను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌లలో నిర్వహించనున్నారు. శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. దీంతో ఆర్థిక సమస్యల కారణంగా అవకాశాలు కోల్పోయిన యువతకు ఇది ఒక మంచి అవకాశం కానుంది.
ప్రతి జిల్లాలో పది మందిని ఈ శిక్షణకు ఎంపిక చేస్తారు. వారిలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉంటారు. ఎంపికైన వారికి పూర్తి స్థాయి శిక్షణను ఉచితంగా ఇస్తారు. శిక్షణ అనంతరం డ్రైవింగ్ రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రవాణా రంగంలో భారీ వాహన డ్రైవర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున యువతకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది.
అభ్యర్థులు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. 20 ఏళ్లు పైబడిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే లైట్ మోటార్ వెహికల్ (LMV) లైసెన్స్ ఉండాలి. దరఖాస్తుతో పాటు ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, విద్యార్హతలు, LMV లైసెన్స్ కాపీ, స్వీయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారిని ఎంపిక చేస్తారు.
ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కాకినాడలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను పూర్తి స్థాయిలో అందించి దరఖాస్తు చేసుకోవాలి. వివరాల్లో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు.
ఎంపిక ప్రక్రియపై సందేహాలు ఉన్నవారు ఎస్సీ కార్పొరేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి కె. సందేశ్‌ను సంప్రదించవచ్చు. ఆయన మొబైల్ నంబర్ 76719 49476. మొత్తానికి ఎస్సీ కార్పొరేషన్, ఆర్టీసీలు కలిసి యువతకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ అందించేందుకు ముందుకు రావడం నిరుద్యోగ ఎస్సీ యువతకు పెద్ద ఆశీర్వాదంగా నిలవనుంది.