వర్షాకాలం వచ్చిందంటే చాలు, నంద్యాల జిల్లాలోని వక్కులేరు వాగు ఒక సందడి వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ప్రతీ సంవత్సరం ఈ వాగులో ప్రజలు వజ్రాల వేటలో మునిగిపోతుంటారు. ఈసారి కూడా వర్షాలు బాగా పడటంతో, వివిధ ప్రాంతాల నుంచి వందల మంది జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తరలివస్తున్నారు. కొందరు సొంత వాహనాల్లో, మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు.
కొంతమందికి వజ్రాలు దొరికాయని వార్తలు వస్తుండటంతో, వారిని చూసి ఇంకా చాలామంది ఆశతో వస్తున్నారు. గతంలో ఎందరో రైతులు రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకే, ఈసారి కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎంతోమంది ప్రజలు వస్తున్నారు.
వజ్రం దొరికితే అదృష్టం, దొరక్కపోతే దురదృష్టం. ఈ నమ్మకంతోనే చాలామంది వక్కులేరు వాగు దగ్గరకు చేరుకుంటున్నారు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గంలో శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపాన ఉన్న ఈ వాగులో ఎక్కడ చూసినా వజ్రాల కోసం తవ్వుతున్న ప్రజలే కనిపిస్తున్నారు.
ఎగువన నల్లమల అడవిలో నుంచి ఈ వాగు ప్రవహిస్తుంది. వర్షాలకు అడవుల్లో నుంచి వజ్రాలు కొట్టుకొచ్చి వాగులో, వాగు ఒడ్డున ఇసుక రాళ్ళలో దాగి ఉంటాయని ప్రజలు నమ్ముతారు. ఏటా ఈ వాగులో వజ్రాల వేట కొనసాగుతుంది. అయితే ఈసారి అధిక వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీనివల్ల వజ్రాలు మరింత కొట్టుకొచ్చాయని నమ్మకంతో జనం పోటెత్తుతున్నారు.
వజ్రాల కోసం వస్తున్నవారిలో నంద్యాల, ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రజలే కాకుండా, సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఉచిత ప్రయాణం అవకాశం ఉండటం వల్ల చాలామంది మహిళలు బస్సుల్లో వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
వజ్రం దొరికితే అదృష్టం వరించిందని భావించి కొందరు సంతోషంగా వెళ్ళిపోతున్నారు. మరికొందరు అయితే రోజులు తరబడి ఈ ప్రాంతంలో ఉండి మరీ ప్రయత్నిస్తున్నారు. కానీ, ఎంత వెతికినా వజ్రం లభించకపోవడంతో కొందరు నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారు.
ప్రయత్నలోపం లేకుండా వెతికి వజ్రం దక్కించుకునే వారు కొందరే, ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని నిరాశతో వెనుతిరిగే వారు చాలామంది. ఇది కేవలం ఒక ఆశతో కూడిన ప్రయాణం, ఇందులో విజయం సాధించినవారు చాలా తక్కువ మందే ఉంటారు. అయినప్పటికీ, ప్రజల ఆశలు, నమ్మకాలు మాత్రం ఏటా కొనసాగుతూనే ఉంటాయి.