సినీ నటి సమంత వ్యక్తిగత జీవితంపై తరచూ వార్తలు వస్తుంటాయి. ఇటీవల కాలంలో ఆమె సినిమాల కంటే తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె సంబంధంపై నిత్యం పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమా? లేక అంతకు మించి ఏమైనా ఉందా? అనేది మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియడం లేదు. అయితే, ఇటీవల మరోసారి ఈ ఇద్దరూ పబ్లిక్‌గా కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
నాగచైతన్య తర్వాత.. సమంత సెకండ్ ఇన్నింగ్స్?
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటారా అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే, తాను నటించిన 'ది ఫ్యామిలీ మెన్', 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి.
సమంత ఎక్కడ ఉంటే రాజ్ అక్కడ కనిపించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరుతోంది. ఇద్దరూ కలిసి పికెల్ బాల్ ఆడటం, సీక్రెట్‌గా పార్టీలు, విహారయాత్రలకు వెళ్లడం వంటివి ఈ వార్తలకు బలాన్నిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం అమెరికాలోని డెట్రాయిట్ వీధుల్లో సమంత, రాజ్ కలిసి కనిపించారు. దీని తర్వాత తాజాగా ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేయడానికి ఇద్దరూ ఒకే కారులో వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, సమంత నిర్మాతగా మారి నిర్మించిన 'శుభం' సినిమా పనులను రాజ్ దగ్గరుండి పర్యవేక్షించారని వార్తలు వచ్చాయి.
ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఇద్దరూ ఒకే విమానంలో జర్నీ చేస్తూ, రాజ్ భుజంపై సమంత తల పెట్టి పడుకున్న ఫొటోలు కూడా పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత రాజ్ నిడిమోరుతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలను సమంత దర్శించుకోవడం ఈ పుకార్లకు మరింత బలాన్నిచ్చింది.
తాజాగా, ఈ ప్రేమ జంట ముంబైలోని బాంద్రాలో పబ్లిక్‌గా దొరికిపోయింది. జిమ్ నుంచి బయటికి వస్తూ, ఇద్దరూ ఒకే రంగు దుస్తులు (లేత గులాబీ రంగు) ధరించి ఒకే కారులో వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు చూసిన అభిమానులు, నెటిజన్లు సమంత, రాజ్ తమ బంధంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
గుడ్ న్యూస్ కోసం ఎదురుచూపులు:
ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత, త్వరలోనే సమంత, రాజ్ ఒక శుభవార్త చెబుతారని అందరూ భావిస్తున్నారు. రాజ్ నిడిమోరు స్వతహాగా తెలుగు వ్యక్తి కావడం విశేషం. ఆయనది చిత్తూరు జిల్లా. ప్రస్తుతం రాజ్ నిడిమోరుకు శ్యామలాదేవితో వివాహమైంది.
ఆమెకు విడాకులిచ్చి రాజ్, సమంతను రెండో పెళ్లి చేసుకుంటారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. రాజ్ భార్య శ్యామలాదేవి కూడా అప్పుడప్పుడు పరోక్షంగా ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో నమ్మకం, విశ్వాసం వంటి అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ వివాదాలపై సమంత, రాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.