ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి విద్యార్థి కల. భద్రమైన భవిష్యత్తు కోసం ఎంతో మంది యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతుంటారు. కొంతమంది చదువుతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. మరికొందరు అకడెమిక్ విద్య పూర్తి చేసిన తర్వాతే ఈ దిశగా అడుగులు వేస్తారు. ఐటీ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో జీతాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉద్యోగ భద్రత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలపైనే నేటి యువత ఆకర్షితమవుతోంది. అయితే ఈ ఉద్యోగాల కోసం పోటీ అంత తేలికైనది కాదు. లక్షలాది మంది మధ్యలో నిలబడాలంటే ప్రత్యేక శిక్షణ, క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం తప్పనిసరి. కానీ పేదరికం కారణంగా అందరికీ ట్రైనింగ్, కోచింగ్ సౌకర్యం అందకపోవడం పెద్ద సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త వినిపించింది.
రాష్ట్రంలోని యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు అంబేద్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వంటి అన్ని వర్గాల యువతకు ఈ అవకాశం లభించనుంది. ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ వంటి దేశవ్యాప్తంగా జరిగే కీలక పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వాలని కమిషన్ నిర్ణయించింది. ఈ శిక్షణలో భాగంగా ఎంపికైన వారికి భోజనం, వసతి సౌకర్యం కూడా పూర్తిగా ఉచితంగా కల్పించనున్నారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరచాలనుకునే ప్రతి యువకుడు, యువతి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పెట్టారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత అక్టోబర్ 12న జిల్లాల వారీగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేస్తారు. ఈ శిక్షణలో నిపుణుల బృందం ద్వారా బోధన జరుగుతుంది. శిక్షణలో భాగంగా టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ పేపర్లు, డిజిటల్ సపోర్ట్ వంటి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ లేదా ఇతర వివరాలకు సంబంధించి అభ్యర్థులు 9949686306 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ కోసం అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రైవేట్ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోనుంది. ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లకు టెండర్లు పిలిచింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బంపరాఫర్‌గా మారబోతున్న ఈ పథకం ద్వారా వేలాది మంది యువతకు ఉచిత శిక్షణతో పాటు భోజనం, వసతి లభిస్తాయి. పేదరికం కారణంగా తమ కలలను వదులుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్న విద్యార్థులకు ఈ కార్యక్రమం నిజమైన వరం కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఎన్నో ప్రభుత్వ, బ్యాంకింగ్, సెంట్రల్ సర్వీస్ పోస్టుల్లో ఏపీ యువత విజయాన్ని సాధించేందుకు దోహదం చేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.