మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులను అనే పద్యం ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. బయటకు బాగానే కనిపిస్తున్నా, లోపల అనేక సమస్యలు దాగి ఉంటాయని ఈ పద్యం అర్థం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసా విధానాల వలన వచ్చిన అనిశ్చితి ఇదే పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా H-1B వీసా సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక తాజాగా ఒక భారతీయ మహిళ చేసిన సోషల్ మీడియా పోస్ట్ అమెరికాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆమె తన భర్త H-1B వీసాపై సంవత్సరానికి సుమారు 1.40 లక్షల డాలర్ల జీతం సంపాదిస్తున్నాడని, తాను H-4 వీసాపై పనిచేస్తున్నానని తెలిపింది. అయితే, వీసా అనిశ్చితి కారణంగా ఇద్దరూ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నామని ఈ కారణంగా ఇప్పటివరకు పిల్లలను కూడా ప్లాన్ చేయలేదని చెప్పుకొచ్చింది.
ఆమె పోస్ట్‌లో మరింత సంచలన అంశం ఏమిటంటే తన ఆఫీస్‌లో గ్రీన్ కార్డు కలిగిన ఒక సహోద్యోగిపై తనకు ఇష్టం ఏర్పడిందని అతనికీ తనంటే ఇష్టమేనని కాబట్టి భవిష్యత్తులో వీసా టెన్షన్ లేకుండా ఉండటానికి భర్తను విడిచి ఆ సహోద్యోగిని పెళ్లి చేసుకోవచ్చా అని నేరుగా ప్రశ్నించింది. ఇకపై భారత్‌కు తిరిగి వెళ్లే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది.
ఈ పోస్ట్ బయటకు రాగానే సోషల్ మీడియాలో చర్చలు వేడెక్కాయి. కొందరు నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని తప్పుబడుతూ, వివాహ బంధాన్ని వీసా సౌకర్యాల కోసం వదులుకోవడం తప్పు అని విమర్శించారు. మరికొందరు మాత్రం అమెరికా వీసా పాలసీలు ఎంత కఠినంగా ఉన్నాయో గుర్తుచేస్తూ ఆమె పరిస్థితిని తప్పు పట్టలేమని వాదిస్తున్నారు.
ఈ సంఘటన అమెరికాలో ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొనే వీసా సవాళ్లు ఎంత క్లిష్టంగా మారాయో చూపిస్తుంది. వీసా సమస్యలు కేవలం కెరీర్‌ను మాత్రమే కాకుండా, వ్యక్తిగత జీవితం, కుటుంబ బంధాలు, భవిష్యత్ నిర్ణయాలపైనా గాఢమైన ప్రభావం చూపుతున్నాయన్న అనేదానికి ఇదే పెద్ద నిదర్శనం.