సహజమైన నటన, అద్భుతమైన నృత్యం, తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో ప్రేక్షకులను అలరించారు నటి సాయి పల్లవి. సినిమాల్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆమె తన సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం ఇలా మూడు భాషల్లోనూ ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ కాలంలోనే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు.
సాయి పల్లవి ప్రతిభకు తమిళనాడు ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన కళైమామణి అవార్డు అందుకోనున్నారు. ఇది ఆమె కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పుకోవాలి. కళారంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవమైన అవార్డును ఇవ్వడం జరుగుతుంది.
తాజాగా తమిళనాడు ప్రభుత్వం 2021, 2022, 2023 సంవత్సరాల కళైమామణి అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించింది. అందులో భాగంగా, 2021 సంవత్సరానికి గాను సాయి పల్లవి పేరు అధికారకంగా ప్రకటించారు.
త్వరలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ అవార్డులను స్వయంగా అందజేయనున్నారు. ఆ వేడుకలో సాయి పల్లవి సహా మరికొందరు అవార్డు గ్రహీతలు పాల్గొననున్నారు.
కళైమామణి అవార్డు తమిళనాడులో అత్యంత గౌరవనీయమైన పురస్కారాలలో ఒకటి. ప్రతి సంవత్సరం సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి విభిన్న కళారంగాల్లో ప్రతిభ చూపిన వారిని గుర్తించి ఈ అవార్డును ప్రభుత్వం అందిస్తుంది. విజేతలకు 24 గ్రాములు బంగారు పతకంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారు.
సాయి పల్లవి పేరు ఇప్పుడు కళైమామణి అవార్డు విజేతల జాబితాలో చేరడం, ఆమె అభిమానులకే కాదు తెలుగు, తమిళ సినీ ప్రపంచానికి కూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చు.