అమరావతిలో రూ.150 కోట్లతో వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ లైబ్రరీని 24 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. లైబ్రరీల్లో పాత మాన్యుస్క్రిప్ట్‌లు (ప్రతులు) కాపాడే పనులు కూడా చేపడతామని వివరించారు.
రాష్ట్రంలో లైబ్రరీల అభివృద్ధికి దాతల సహకారం కూడా వస్తుందని మంత్రి చెప్పారు. శోభా డెవలపర్స్ అనే సంస్థ రూ.100 కోట్ల విరాళం ప్రకటించిందని, అలాగే విశాఖలో రూ.20 కోట్లతో మోడల్ లైబ్రరీ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. పిల్లల్లో చదవడం మీద ఆసక్తి పెంచేలా వచ్చే ఆరు నెలల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రంథాలయాల్లో కమ్యూనిటీ కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళగిరిలో మోడల్ లైబ్రరీ నిర్మాణం పూర్తికావచ్చిందని, అక్టోబర్‌లో ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం 13 జిల్లా లైబ్రరీలు మాత్రమే ఉన్నాయని, కొత్త జిల్లాల ప్రకారం మొత్తం 26 జిల్లా లైబ్రరీలు ఏర్పాటవుతాయని మంత్రి చెప్పారు. లైబ్రరీ సెస్సు వసూళ్లు పూర్తిగా రావడం లేదని, గత మూడు సంవత్సరాల్లో కేవలం 40% నుంచి 52% వరకే వసూలైందని తెలిపారు. ఈ సమస్యపై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులతో చర్చించి పరిష్కారం తీసుకురావాలని భావిస్తున్నారు.
లైబ్రరీల్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని పుస్తకాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే డిజిటల్ లైబ్రరీల కోసం ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించామని, వంద రోజుల్లో దాన్ని విడుదల చేస్తామని చెప్పారు. సభ్యుల సూచనలతో దేశానికి ఆదర్శంగా నిలిచేలా లైబ్రరీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.