ప్రస్తుతం చాలా ఇళ్లలో వంటకాలకు నాన్ స్టిక్ గిన్నెలు వాడుతున్నారు. వీటిలో కూరగాయలు మాడిపోవడం, రుచి తగ్గిపోవడం జరగదు. అలాగే ఈ పాత్రలను శుభ్రం చేసుకోవడం కూడా సులభం. అందువల్ల ఆధునిక వంటగదిలో నాన్ స్టిక్ పాన్‌లు సాధారణంగా కనిపిస్తున్నాయి.
అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, నాన్ స్టిక్ పాన్‌లు పూర్తిగా సురక్షితం కావని చెబుతున్నారు. వీటి పైభాగంలో పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ (PTFE) అనే పదార్థంతో పూత ఉంటుంది. ఈ పూత కారణంగానే ఆహారం అంటకుండా, వేడి తట్టుకునే గుణం వస్తుంది.
PTFE సాధారణ ఉష్ణోగ్రతల్లో ప్రమాదకరమేమీ కాదు. కానీ ఎక్కువ వేడి వద్ద ఇది పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్ (PFOA)తో కలిసి విషపూరిత పొగలు విడుదల చేస్తుంది. ఈ పొగలు మన శరీరానికి హానికరం కావడంతో పాటు “పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్” అనే ఫ్లూ లాంటి సమస్యలకు దారితీస్తాయి.
అదే సమయంలో PFOA కలిగిన పాన్‌లను ఎక్కువకాలం వాడితే లివర్, కిడ్నీ, టెస్టిస్ క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక థైరాయిడ్ పనితీరు తగ్గడం, పిల్లల ఎదుగుదలకు ఆటంకం కలగడం వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. పాన్‌లపై ఉన్న కోటింగ్ ఆహారంలో కలిసిపోతే జీర్ణ సమస్యలు రావచ్చని వైద్యుల సూచన.
ఈ కారణాల వల్ల నాన్ స్టిక్ పాన్‌ల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీలు, సిరామిక్, మట్టి పాత్రలు ఆరోగ్యానికి హానికరం కాకుండా, ఎక్కువకాలం ఉపయోగించడానికి కూడా సురక్షితంగా ఉంటాయి.