ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో స్పష్టం చేశారు. గత 15 నెలల్లోనే రూ.10.40 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని దెబ్బతీసినా, 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణ యుగం మొదలైందని లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఆర్సెలార్ మిత్తల్ భారీ ఉక్కు కర్మాగారం వచ్చే నవంబరులో ప్రారంభంకానుందని ప్రకటించారు.
లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి 25 కొత్త పాలసీలను రూపొందించామని తెలిపారు. ఇప్పటికే 340 ఎంవోయూలు కుదుర్చుకోవడం ద్వారా రూ.10.40 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అదనంగా మరో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. బీపీసీఎల్, ఎన్టీపీసీ, రెన్యూ, టాటా పవర్ వంటి సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయని, ఐబీఎం సంస్థ అమరావతిలో దక్షిణాసియాలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. ఇదే సమయంలో టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి ఐటీ దిగ్గజాలు కూడా రాష్ట్రంపై దృష్టి సారించాయని వెల్లడించారు.
పర్యాటక రంగంలో కూడా భారీ ప్రణాళికలు ఉన్నాయని లోకేష్ తెలిపారు. తాజ్, ఐటీసీ వంటి ప్రసిద్ధ హోటల్ సంస్థలు 6,000 గదులను అందుబాటులోకి తేనున్నాయని, వచ్చే ఐదేళ్లలో 50,000 గదులు ఏర్పాటవుతాయని అన్నారు. అలాగే, రిలయన్స్ సంస్థ కర్నూలులో పెద్ద ఫుడ్ పార్కును ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా బలపడతాయని లోకేష్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఐటీ కంపెనీలకు భూములు ఇచ్చారని విమర్శిస్తున్నప్పటికీ, టీసీఎస్ ఒక్కటే విశాఖలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తోందని, ఏటా రూ.15,000 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, రూ.1,500 కోట్ల పన్ను రాష్ట్రానికి వస్తోందని గణాంకాలతో సమాధానం ఇచ్చారు.
2014–19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం డిక్సన్, అపోలో టైర్స్, ఫాక్స్‌కాన్ వంటి అనేక ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చిందని గుర్తుచేశారు. కానీ, గత వైసీపీ పాలనలో ఆ సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి ఆ సంస్థలను ఆకర్షించే ప్రయత్నంలో ఉందని, ఇప్పటికే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. పెట్టుబడులు వస్తే రాష్ట్ర యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ భరోసా ఇచ్చారు.