ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు (Ants) గుంపులు గుంపులుగా తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా వంటగదిలో ఏదైనా తినే పదార్థం పెడితే చాలు, క్షణాల్లో వేలాది చీమలు చుట్టుముడతాయి. ఎంత శుభ్రం చేసినా అవి మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి.
ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలామంది కెమికల్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తారు. అవి ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచివి కావు. కానీ, మన ఇంట్లోనే ఉండే కొన్ని సహజ పదార్థాలతో చీమలను శాశ్వతంగా ఇంట్లోంచి తరిమికొట్టొచ్చు.
చీమలను తరిమికొట్టేందుకు బెస్ట్ హ్యాక్స్:
బిర్యానీ ఆకు, ఉప్పు సొల్యూషన్:
కొన్ని బిర్యానీ ఆకులను (Bay leaf) చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఇలా చేయడం వల్ల ఆకుల్లోని సువాసన బాగా బయటకు వస్తుంది.
ఒక గిన్నెలో ఒకటి నుంచి రెండు టేబుల్‌స్పూన్ల ఉప్పు తీసుకుని, అందులో ఈ ఆకు ముక్కలను కలపాలి.
ఈ మిశ్రమాన్ని చీమలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలైన కిచెన్ కౌంటర్‌టాప్స్, కిటికీలు, డోర్‌ఫ్రేమ్‌ల పక్కన ఉంచాలి. ఇలా చేస్తే చీమలు ఆ ప్రదేశాల్లోకి రావు.
ఇది ఎందుకు పనిచేస్తుంది? చీమలు ఒకదానిని ఒకటి వాటి వాసన ద్వారా ఫాలో అవుతాయి. బిర్యానీ ఆకులోని యూకలిప్టాల్ అనే పదార్థం వాటి వాసన పట్టే సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. అలాగే, ఉప్పు వాటికి ఒక బ్యారియర్‌గా పనిచేస్తుంది. ఉప్పుతో తాకినప్పుడు చీమల శరీరంలోని తేమ మొత్తం లాగేసి, అవి డీహైడ్రేషన్‌తో చనిపోతాయి.
బేకింగ్ సోడా, చక్కెర మిశ్రమం:
ఇది కూడా చీమలను తరిమికొట్టడానికి (Ants Control) బాగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా చీమలకు ఒక రకమైన విషంలా పనిచేస్తుంది, చక్కెర వాటిని ఆకర్షిస్తుంది.
ఒక చిన్న గిన్నెలో సమాన మోతాదులో బేకింగ్ సోడా, చక్కెర కలపాలి.
ఈ మిశ్రమాన్ని చీమలు తిరిగే ప్రదేశాల్లో చల్లాలి. అవి చక్కెర తినేటప్పుడు బేకింగ్ సోడా కూడా తింటాయి. ఇది వాటి పొట్టలో గ్యాస్ ఉత్పత్తి చేసి చంపేస్తుంది.
నిమ్మరసం:
నిమ్మరసం చీమలకు సహజమైన డిటరెంట్‌గా పనిచేస్తుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ వాసన చీమలకు నచ్చదు.
ఒక స్ప్రే బాటిల్‌లో సమాన మోతాదులో నిమ్మరసం, నీళ్లు కలపాలి.
ఈ మిశ్రమాన్ని చీమలు ప్రవేశించే దారులు, కిటికీలు, తలుపుల దగ్గర స్ప్రే చేయాలి. ఇది చీమలను చంపదు, కానీ వాటిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. రోజూ స్ప్రే చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
మరికొన్ని చిట్కాలు:
వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి: చీమలు ఆహారం కోసమే వస్తుంటాయి. అందుకే కౌంటర్‌టాప్స్, ఫ్లోర్‌పై ఆహార పదార్థాల ముక్కలు లేకుండా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా స్వీట్స్, జ్యూస్ లాంటివి ఎక్కువగా చిందకుండా చూసుకోవాలి.
పగుళ్లను మూసివేయండి: డోర్స్, కిటికీలకు ఏవైనా పగుళ్లు, గ్యాప్స్ ఉంటే వాటిని సీల్ చేయండి. ఆహార పదార్థాలను గాలి చొరబడని కంటైనర్లలో స్టోర్ చేయాలి.
ఈ సహజ చిట్కాలు పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకుంటూనే చీమల బెడద నుంచి సులభంగా బయటపడవచ్చు.