ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త చరిత్ర రాయాలని నారా లోకేష్ బిగ్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రిగా ఆయన ఇప్పుడు విశాఖపట్నాన్ని కొత్త టెక్నాలజీ రాజధానిగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. చిన్నప్పటి నుంచే తన తండ్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదును ఐటీ నగరంగా ఎలా మార్చారో దగ్గరగా చూసిన లోకేష్, ఇప్పుడు ఆ కలను మరో రూపంలో విశాఖలో సాకారం చేయాలనుకుంటున్నారు.
1990వ దశకంలో హైదరాబాదు ఐటీ నగరంగా ఎదగడంలో చంద్రబాబు పాత్ర ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలను హైదరాబాదుకు ఆహ్వానించి, సైబరాబాద్ రూపకల్పన చేసి, ఆ నగరాన్ని బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా నిలబెట్టారు. కానీ తెలంగాణ ఏర్పాటుతో ఆ కలలో సగం ఆయన చేతుల నుంచి జారిపోయింది. హైదరాబాదు తెలంగాణకు రాజధానిగా మారడంతో ఆ కలను కొనసాగించే అవకాశం కోల్పోయారు. ఇప్పుడు అదే కలను తన శైలిలో కొనసాగించేందుకు లోకేష్ ముందుకొచ్చారు.
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. విశాఖపట్నం త్వరలోనే ప్రపంచ టాప్ టెక్ సిటీల్లో ఒకటిగా నిలుస్తుంది అని ఆయన ధైర్యంగా ప్రకటించారు. ఈ మాటలు సాదారణ హామీలా కాకుండా, పూర్తి స్థాయి రోడ్‌మ్యాప్‌కు పునాది వేసేలా వినిపించాయి.
ఇంతలోనే ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలతో విసిగి పోయిన ఓ ప్రముఖ టెక్ కంపెనీ యజమాని సోషల్ మీడియాలో ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని రాసారు. వెంటనే లోకేష్ స్పందించి, మీ కంపెనీని విశాఖకు తీసుకురండి. వైజాగ్ క్లిన్ సిటీ, మౌలిక సదుపాయాలు బాగా ఉన్నాయి మహిళలకు సేఫ్ సిటీ అంటూ ఆహ్వానించారు. ఆ స్పందన ఒక్కసారిగా వైరల్ అయ్యి బెంగళూరుకే సవాల్ విసిరినట్టైంది.
అంతకుముందు కూడా ఆయన ఇలాంటి పిలుపులు ఇచ్చారు. బెంగళూరు ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికుల కోటా బిల్లు తెచ్చినప్పుడు, మా రాష్ట్రంలో అలాంటి ఆంక్షలు లేవు. కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి అంటూ కంపెనీలను ఆకర్షించారు. ఏరోస్పేస్ పార్క్ బెంగళూరులో ఆగిపోవడంతో మా దగ్గర 8,000 ఎకరాల భూమి ఉంది రండి చర్చిద్దాం అని పరిశ్రమలకు
ఆహ్వానం పంపించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
ప్రతి అవకాశం వినియోగించుకుంటూ విశాఖను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో లోకేష్ ముందుకు సాగుతున్నారు. తండ్రి కల సాకారం కాలేదని చూసిన ఆయన, ఇప్పుడు అదే కలను పూర్తి చేసి తండ్రి పేరు నిలబెట్టాలని సంకల్పించారు. ఈ పోరాటం ఆయనకు కేవలం అభివృద్ధి కోసం మాత్రమే కాదు, రాజకీయంగా తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికీ అనిపిస్తోంది.